Home AP ఉద్యోగులకు చంద్రబాబు భారీ వరాలు

ఉద్యోగులకు చంద్రబాబు భారీ వరాలు

పీఆర్సీ, డీఏలపై కీలక నిర్ణయాలు.
పెండింగ్ సమస్యలకు గ్రీన్‌సిగ్నల్.

ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. 12వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో రెండు డీఏల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2024 జూలై 1, 2025 జనవరి 1కు సంబంధించిన ఈ రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 2022 సరెండర్ లీవుల బకాయిలను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి అంగీకరించారు. పోలీసులకు ఒక అదనపు సరెండర్ లీవ్‌ను ఈ దసరాకే చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

పెన్షనర్లకు మళ్లీ అదనపు పెన్షన్

గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను 2027 జనవరి నుంచి పునరుద్ధరించనున్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ అందనుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను మరింత సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల నుంచే ప్రతి నెలా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు చేసేలా వ్యవస్థను స్ట్రీమ్‌లైన్ చేయనున్నారు. ఉద్యోగుల కోసం తీసుకున్న తాజా నిర్ణయాలతో ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. గత రెండేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో రూ.30,849 కోట్లను ఇప్పటికే క్లియర్ చేశామని చెప్పారు. ఆర్థిక సంస్థలతో చర్చించి రూ.1.50 లక్షల కోట్ల అప్పులపై వడ్డీ భారాన్ని రీషెడ్యూల్ చేసి తగ్గించామని వివరించారు.

ఉద్యోగుల గౌరవమే ప్రభుత్వ విధానం

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగులను దూరం పెట్టారని, రివర్స్ పీఆర్సీ ఇచ్చారని, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను గౌరవిస్తూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఆర్థిక వెసులుబాటు కలిగిన ప్రతిసారీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా తాజా నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పీఎఫ్ లోన్లు కూడా అందక ఇబ్బందులు పడి, కొందరు ఉద్యోగులు పెళ్లిళ్లు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చిందని వారు గుర్తు చేశారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణపై కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుంటామని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

 

#ChandrababuNaidu #APGovernmentEmployees #GovernmentEmployees #12thPRC #PayRevisionCommission #DARelease #DAHike #EmployeeBenefits #APEmployees #APPensioners #SurrenderLeave #AdditionalPension #AndhraPradeshGovernment #TDPGovernment #APPolitics