Home AP వరాహ నదిలో విషాదం ముగ్గురు యువకులు మృతి!

వరాహ నదిలో విషాదం ముగ్గురు యువకులు మృతి!

సరదా కోసం వెళ్లి.. మృత్యుఒడిలోకి.
పుట్టినరోజు వేడుకల తర్వాత ఈతకు వెళ్లి ప్రమాదం.

అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామ సమీపంలోని వరాహ నదిలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్‌ సమీపంలోని గ్రోయిన్‌ వద్ద ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ముప్పిడి వంశీ (25), కాటేటి రిషి (18), కోడి జగదీశ్‌ అలియాస్‌ బాలు (18) మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి నితిన్‌ (18)ను కాపాడారు. వంశీ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, మిగిలిన ముగ్గురు పెయింటర్లుగా జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడు దిగుమర్తి రవితేజ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం వీరంతా నదిలో ఈతకు వెళ్లినట్లు సీఐ కె.రామకృష్ణ తెలిపారు.

గాలింపు కొనసాగింపు.. మంత్రి పరామర్శ

నదిలో నీటి ఉధృతి, లోతు అంచనా వేయలేక ముగ్గురు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు. రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి తిరిగి గాలింపు కొనసాగించనున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకతో ఆనందంగా గడపాల్సిన యువకులు నదిలో ప్రమాదానికి గురికావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

 

#VarahaRiver #Anakapalli #AndhraPradesh #DrowningIncident #RiverTragedy #YouthDeaths #Penugollu #SRayavaram #SDRF #HomeMinisterAnitha