అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలి.
ప్రతి గ్రామంలో బలమైన అభ్యర్థులు:సజ్జల.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సర్పంచ్, వార్డు స్థానాన్ని కూడా పోటీ లేకుండా వదలొద్దని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ మద్దతుదారులు బరిలో ఉండాలని, రిజర్వేషన్లు, సామాజిక సమీకరణలు, ప్రజాబలం, నాయకత్వ సామర్థ్యాన్ని పరిశీలించి సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి స్థానంలో పోటీ చేయాలన్నారు.
అక్రమాలపై ఆధారాలు.. అవసరమైతే న్యాయపోరాటం
గత స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల అడ్డగింతలు, బెదిరింపులు, పోలీసుల దౌర్జన్యాలు ఎదురయ్యాయని సజ్జల పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వీడియోలు, ఫొటోలు, ఇతర ఆధారాలు సేకరించి అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవసరమైతే న్యాయపోరాటం చేయాలని, మండల స్థాయిలో న్యాయ సమన్వయ బాధ్యులను నియమించాలని ఆదేశించారు. పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లను పర్యవేక్షించాలని, ప్రతి పరిణామాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని చెప్పారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే పది రోజుల నామినేషన్ల ప్రక్రియపై ప్రత్యేక నిఘా పెట్టి, గ్రామం నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
#YSJagan #YSRCP #SajjalaRamakrishnaReddy #PanchayatElections #AndhraPradeshPolitics #SarpanchElections #WardElections #YSRCPElectionStrategy #LocalBodyPolls #APPolitics











