Home AP తుపాన్ బాధితులకు భరోసా! బాధితులకు తక్షణమే సాయం

తుపాన్ బాధితులకు భరోసా! బాధితులకు తక్షణమే సాయం

అప్రమత్తతతో నష్టం తగ్గింది.
సీఎం చంద్రబాబు వెల్లడి .

అర్నబ్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు రోజుల్లో ఏడు సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి షెల్టర్‌ క్యాంపుల్లో వసతులు కల్పించామన్నారు. సుమారు 30 వేల మంది అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగించామని చెప్పారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేశారు.

విద్యుత్‌ పునరుద్ధరణ.. కేంద్రానికి నివేదిక

తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయని చంద్రబాబు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరిలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ త్వరగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. రహదారులపై రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని, అత్యవసర ఆహారం, మందుల సరఫరాకు డ్రోన్లను సిద్ధం చేశామని వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ శాఖ సమాచారంతో తుపాన్ గమనాన్ని అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టామని వివరించారు. తుపాన్ నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపించి, సమగ్ర నివేదికను త్వరలో అందిస్తామని తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

తుపాన్ కారణంగా విశాఖపట్నంలో ఇద్దరు, అనకాపల్లి, కోనసీమ, భీమవరం ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మరణించారని ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇళ్లలోకి వరదనీరు చేరిన బాధితులకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతో పాటు ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామన్నారు. షెల్టర్‌ క్యాంపుల్లో ఉన్నవారికి రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేలు, టమాటాకు రూ.25 వేలు, పత్తి, చెరకు వంటి పంటలకు హెక్టారుకు రూ.25 వేల సాయం అందించే అంశాన్ని వెల్లడించారు.

రేపు క్షేత్రస్థాయి పర్యటన.. బాధితులకు అండ

తుపాన్ వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం 39 శాతం నుంచి 27 శాతానికి తగ్గిందని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో 21 సెంటీమీటర్లు, విజయనగరంలో 18 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. ముందస్తు చర్యలతో చెరువులకు గండ్లు పడకుండా నివారించగలిగామని చెప్పారు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని అభినందించారు. గురువారం స్వయంగా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. బాధితులకు వేగంగా ఆర్థిక సాయం అందించి, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

#CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh #CycloneRelief #CycloneVictims #Compensation #DisasterManagement #PowerRestoration #CropDamage #FarmersRelief #FishermenRelief #Visakhapatnam #Konaseema #AndhraPradeshNews