డెలివరీ పేరుతో రూ.62 వేల బంగారం మాయం!
పార్శిల్ తీసుకున్నాడు.. బంగారంతో పరారయ్యాడు!
హైదరాబాద్‌లో ఆన్లైన్ సేవలపై నమ్మకం పెట్టుకుంటే ఇలా ఉంటుందా అంటూ ఓ బాధితుడు లబోదిబోమంటున్నాడు. బైక్‌పై వెళ్లాల్సిన రైడర్ ఏకంగా బంగారు నగలతోనే మాయమయ్యాడని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. వివో సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న దత్తప్రసాద్ నీతిపల్లి అక్టోబర్ 27న తన బంధువులకు నగలు పంపేందుకు ర్యాపిడో పార్శిల్ సేవను బుక్ చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు బిజు చేతికి పార్శిల్ అందించి నాగోల్‌లోని బంధువులకు చేర్చాలని సూచించారు. అందులో జోయాలుక్కాస్‌లో కొనుగోలు చేసిన రూ.62,383 విలువైన బంగారు సైడ్ ఇయర్ చైన్, గివాలో కొనుగోలు చేసిన రోజ్ గోల్డ్ పట్టీ ఉన్నాయి. మొత్తం విలువ దాదాపు రూ.70 వేలు. బంధువుల చేతికి చేరాల్సిన బంగారం మధ్యలోనే అదృశ్యమైందన్నది ఫిర్యాదు సారాంశం.
పెట్రోల్‌కు వంద.. ఆపై ఫోన్ బంద్!
పార్శిల్ తీసుకున్న రైడర్ జి. మురళి కొద్దిసేపటికే ఫోన్ చేసి పెట్రోల్ కోసం మరో రూ.100 కావాలని అడిగాడట. బాధితుడు ఫోన్‌పే ద్వారా ఆ మొత్తం పంపించాడని సమాచారం. ఆ తర్వాత పార్శిల్ గమ్యస్థానానికి చేరలేదు.. రైడర్ ఫోన్ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. చివరకు బాధితుడి నంబర్‌ను బ్లాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ర్యాపిడో కస్టమర్ కేర్‌ను ఆశ్రయించినా స్పందన లేదని బాధితుడు వాపోయారు. పార్శిల్ డెలివరీకి బుక్ చేస్తే బంగారం గమ్యానికి చేరుతుందో లేదో తెలియదు కానీ, పెట్రోల్ ఖర్చు మాత్రం అదనంగా వసూలైందన్నమాట! పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డెలివరీ సేవా.. బంగారం బదిలీనా?
సాధారణ వస్తువుల నుంచి విలువైన నగల వరకు యాప్‌ల ద్వారా పంపించుకునే రోజుల్లో ఈ ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. రైడర్ వివరాల పరిశీలన ఎంతవరకు జరిగింది? విలువైన వస్తువుల భద్రతకు ఎలాంటి హామీ ఉంది? పార్శిల్‌కు బీమా, ప్రత్యేక ట్రాకింగ్ లేకుండా బంగారం పంపడంలోనూ ప్రమాదం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది. బైక్‌పై పార్శిల్ వెళ్లాల్సింది నాగోల్‌కు.. కానీ బంగారం ఎక్కడికి వెళ్లిందో పోలీసుల దర్యాప్తులోనే తేలాలి! అప్పటివరకు బాధితుడికి బంగారం కోసం ఎదురుచూపులే మిగిలాయి.
#Rapido #RapidoParcel #HyderabadCrime #GoldJewellery #ParcelTheft #DeliveryRider #JubileeHills #Nagole #HyderabadNews #TelanganaPolice #OnlineDelivery











