భారీ భద్రతా ఏర్పాట్లు..
10 వేల కెమెరాలు.. 24 డ్రోన్లతో నిఘా.
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల తుది ఘట్టమైన మహానిమజ్జన శోభాయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న బాలాపూర్ గణేశ్ శోభాయాత్రతో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే మూడో రోజు నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. తుది శోభాయాత్రను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మూడు నెలల ముందే పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, అగ్నిమాపక, హైడ్రా విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. 14,929 గణేశ్ మండపాలకు ఆన్లైన్ అనుమతులు ఇచ్చి జియో ట్యాగింగ్ చేశారు. ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తైంది.
టెక్నాలజీతో కట్టుదిట్టమైన నిఘా
శోభాయాత్ర మార్గంలో ప్రతి కదలికను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థను రంగంలోకి దించారు. 10 వేల సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. 24 డ్రోన్లు, దాదాపు 100 హైరైజ్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగనుంది. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. భద్రత కోసం హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన దాదాపు 28 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇతర జిల్లాల నుంచి మరో 8,142 మంది సిబ్బందిని రప్పించారు. 4 ఆర్ఏఎఫ్ కంపెనీలు, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలు, 53 బీడీ బృందాలను కూడా మోహరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్ద పరికరాలు, బాణసంచాపై నిషేధం అమల్లో ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం 26 షీ-టీమ్స్ బృందాలు ప్రత్యేకంగా విధుల్లో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555ను సంప్రదించాలని సూచించారు. ప్రజలు సంయమనం పాటించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ వీసీ సజ్జనార్ కోరారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, పుకార్లను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ గంగా-జమునా తెహజీబ్‌ను కాపాడుతూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
#GaneshImmersion2026 #GaneshNimajjanam #HyderabadGanesh #MahaNimajjanam #BalapurGanesh #KhairatabadGanesh #HyderabadPolice #VCSajjanar #CCTV #DroneSurveillance #GaneshShobhayatra #HyderabadSecurity #GaneshFestival #Telangana #GaneshChaturthi











