అమరావతిలో తొలిసారిగా చరిత్రాత్మక వేడుక.
జెండా అవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు.
రాజధాని అమరావతిలో తొలిసారిగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడి పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. “మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన ఎజెండా ఉండాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని గుర్తుచేశారు. దేశం మనకు ఏం చేసిందని కాకుండా.. దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాలని ప్రజలను కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్‌తో పాటు స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఏపీని వికాసం నుంచి వైభవం వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇప్పటికే ఆమోదం లభించిందని వివరించారు. వీటి ద్వారా 11 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రజా సంక్షేమమే స్వర్ణాంధ్ర బాట
రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు వివరించారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తున్నామని, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, మహిళా సాధికారత, పర్యాటక అభివృద్ధి, రాయలసీమ హార్టికల్చర్ హబ్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని, రెవెన్యూ సంస్కరణలతో ఆస్తుల హక్కులను కాపాడుతున్నామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌పై ఈగల్ టాస్క్‌ఫోర్స్‌తో కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. దేశం గర్వించేలా ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
#Amaravati #IndependenceDay2026 #ChandrababuNaidu #Swarnandhra #Swarnandhra2047 #AndhraPradesh #AmaravatiCapital #APDevelopment #20LakhJobs #APInvestments #IndustrialDevelopment #MSME #OneFamilyOneEntrepreneur #GoogleAIDataCenter #AnnaDathaSukhibhava #APWelfare #ViksitBharat #IndependenceDay #AndhraPradeshNews #APPolitics










