Home Naadesam_Special ఆ విజయం మీ ఖాతాలో వేసుకోవద్దు సీఎం రేవంత్‌పై కవిత ఘాటు విమర్శలు

ఆ విజయం మీ ఖాతాలో వేసుకోవద్దు సీఎం రేవంత్‌పై కవిత ఘాటు విమర్శలు


అది దేశ యువత పోరాట ఫలమని వ్యాఖ్య

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 36 రోజులపాటు పోరాడి సాధించిన విద్యార్థుల విజయాన్ని సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి రావడానికి విద్యార్థుల ఉద్యమమే కారణమని పేర్కొన్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని యువతే తీసుకొచ్చిందని, దానిని కాంగ్రెస్ విజయంగా చూపించే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు.

ఊరేగింపులతో మభ్యపెట్టలేరు

విద్యార్థుల విజయాన్ని తమ ఘనతగా చూపించేందుకు సీఎం సహా కాంగ్రెస్ నాయకులు నగర వీధుల్లో గంటల తరబడి ఊరేగింపులు చేశారని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై యువత ప్రశ్నిస్తుందనే భయంతోనే ఈ ప్రదర్శనలు నిర్వహించారని ఆరోపించారు. కొవ్వొత్తులు పట్టుకొని ఊరేగింపులు చేసినంత మాత్రాన విద్యార్థులు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

యువతకు ఇచ్చిన హామీలు ఎక్కడ?

21 ఏళ్లకే పార్లమెంట్‌లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇప్పుడు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కవిత ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

అసెంబ్లీలో బిల్లులు ఆమోదించినా కేంద్రం వద్ద వాటిని ముందుకు తీసుకెళ్లకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. యువతను మాటలతో మోసం చేయడం ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఇదే యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. విద్యార్థుల విజయానికి నిజమైన గౌరవం ఇవ్వాలంటే వారి సమస్యలను పరిష్కరించాలని, రాజకీయ ప్రచారానికి ఆ విజయాన్ని ఉపయోగించవద్దని కవిత సూచించారు.

 

#Kavitha #KalvakuntlaKavitha #RevanthReddy #BRS #Congress #TelanganaPolitics #StudentMovement #YouthPower #Telangana #JobCalendar #FeeReimbursement #OsmaniaUniversity #IndiaNews #PoliticalNews #Youth