Home Naadesam_Special కాంగ్రెస్ ఇన్‌ఛార్జీలు ఇన్ & ఔట్

కాంగ్రెస్ ఇన్‌ఛార్జీలు ఇన్ & ఔట్

హైకమాండ్ అంతరంగంపై డౌట్.
అధికారం చేపట్టాక నాలుగో చేంజ్ .
రేవంత్‌ సర్కారుకు న్యూకమాండ్‌.

అధికారం చేతిలో ఉంది.. ముఖ్యమంత్రి పీఠం పదిలంగానే ఉంది.. అయినా తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్‌ఛార్జిల మార్పుల పర్వం ఎందుకు ఆగడం లేదు? ఎన్నికల విజయంతో మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు అంతర్గత అసమ్మతులు, ఆధిపత్య పోరు, అధిష్ఠానం జోక్యం చుట్టూ తిరుగుతోందా? రెండున్నరేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జిలు మారడం వెనుక అసలు కథేంటి? మాణిక్‌రావ్‌ ఠాక్రే నుంచి దీపాదాస్‌ మున్షీ, మీనాక్షి నటరాజన్‌ మీదుగా ఇప్పుడు బీఎం సందీప్‌ వరకు సాగిన ఈ మార్పుల పరంపర కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వానికి అధిష్ఠానం కొత్త సంకేతాలు పంపుతోందా? రాహుల్‌ గాంధీకి సన్నిహితుడైన సందీప్‌ నియామకం వెనుక సంస్థాగత ప్రక్షాళన వ్యూహం ఉందా? అధికారం వచ్చినా ఆగని మార్పులు.. మార్పుల వెనుక కనిపించని రాజకీయ చదరంగం.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?



తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవంబర్‌ 14న పార్టీ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ను నియమించింది. మీనాక్షి నటరాజన్‌ను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2023 జనవరి నుంచి చూస్తే తెలంగాణకు ఇది నాలుగో ఇన్‌ఛార్జి మార్పు. మొదట మాణిక్‌రావ్‌ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. ఆయన పర్యవేక్షణలోనే కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత దీపాదాస్‌ మున్షీ, 2025 ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సందీప్‌ నియామకంతో మరోసారి పార్టీ వ్యవహారాలపై చర్చ మొదలైంది.

ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి మధ్య విభేదాలా?

మీనాక్షి నటరాజన్‌ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ సంస్థాగత నాయకత్వం, ఢిల్లీ అధిష్ఠానం మధ్య కొన్ని అంశాల్లో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం కీలకంగా మారింది. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు ఆమె మద్దతు తెలిపినట్లు వార్తలు రావడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరితో విభేదాలు తలెత్తాయి. మరోవైపు జిల్లా స్థాయి పార్టీ నియామకాలు, బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ వర్గం రాజకీయంగా ప్రభావం ఉన్న కొత్త నేతలను చేర్చుకోవాలని భావిస్తే, నటరాజన్‌ పాత కాంగ్రెస్‌ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

సందీప్‌ నియామకం వెనుక హైకమాండ్‌ వ్యూహం?

మీనాక్షి నటరాజన్‌కు 2026 జూన్‌లో మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారైనా, తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ కోర్టు వ్యవహారాన్ని అఫిడవిట్‌లో వెల్లడించలేదన్న కారణంతో ఆమె నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. హైదరాబాద్‌ నుంచి సమాచారం లీక్‌ కావడం వల్లే కాంగ్రెస్‌ ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయిందన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ప్రస్తుతం ఆమె బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన బీఎం సందీప్‌ గతంలో మహారాష్ట్ర, గుజరాత్‌లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎనిమిదేళ్లపాటు కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేశారు. రాహుల్‌ గాంధీకి సన్నిహితంగా ఉండటం ఆయన నియామకంలో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయనకు పెద్దగా ప్రజాబలం ఉన్న నాయకుడిగా కాకుండా సంస్థాగత వ్యవహారాల్లో అనుభవం ఉన్న నేతగా గుర్తింపు ఉంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో సమన్వయం, పాత కాంగ్రెస్‌ నేతల ఆకాంక్షలు, అధిష్ఠానం అంచనాల మధ్య సమతుల్యత సాధించడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యత. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియామకం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

#BMSandeep #TelanganaCongress #MeenakshiNatarajan #CongressHighCommand #RevanthReddy #RahulGandhi #ManikraoThakre #DeepaDasmunshi #CongressPolitics #TelanganaPolitics