Home National_news మావోయిస్టుల హింసకు ఆదివాసీలు బలి

మావోయిస్టుల హింసకు ఆదివాసీలు బలి

ఓటు హక్కుకూ దూరం చేశారన్న ప్రధాని.

మావోయిస్టుల హింస కారణంగా దేశంలో అత్యధికంగా నష్టపోయింది గిరిజన సమాజమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. గిరిజన పిల్లలను బలవంతంగా తీసుకెళ్లడం, యువతులను అపహరించడం వంటి ఘటనలు జరిగినా గత ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నిర్వహించిన జనజాతీయ గౌరవ్‌ దివస్‌ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. మావోయిస్టు హింస తగ్గడంతో గిరిజన ప్రాంతాల్లో భద్రత మెరుగుపడిందని, పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

గిరిజన సంక్షేమానికి లక్ష కోట్లకు పైగా నిధులు

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ తెలిపారు. పీఎం జన్మన్‌, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ పథకాలకు రూ.లక్ష కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. గత 12 నుంచి 13 ఏళ్లలో దాదాపు 50 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా పేదలకు నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మించామని, 18 వేల గ్రామాలకు విద్యుత్‌ అందించామని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, 1.75 లక్షలకు పైగా ఆరోగ్య మందిరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ముద్ర రుణాలు, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని వివరించారు.

రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల విలువైన గిరిజన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 170కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించగా, మరో 70కి పైగా పనులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌ కేంద్రాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాలకు పీఎం ధన్‌ధాన్య కృషి యోజన ద్వారా ప్రోత్సాహం అందిస్తామని మోదీ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, రాణి దుర్గావతి, సిద్ధూ-కాన్హూ వంటి గిరిజన పోరాటయోధుల త్యాగాలను గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉండటం దేశానికి గర్వకారణమన్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో వికసిత భారత్‌ నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

#NarendraModi #MaoistViolence #TribalWelfare #BirsaMunda #JanjatiyaGauravDiwas #Gadchiroli #PMJANMAN #TribalDevelopment #Maharashtra #IndianPolitics