Home General క్యాన్సర్ పేషంట్లకు గుడ్ న్యూస్

క్యాన్సర్ పేషంట్లకు గుడ్ న్యూస్

భారీగా తగ్గనున్న మందుల ధరలు.
543 బ్రాండ్లపై భారీ తగ్గుదల.
నవంబర్‌ 9 నుంచి కొత్త రేట్లు అమలు .

క్యాన్సర్‌ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 543 బ్రాండ్ల క్యాన్సర్‌ మందుల గరిష్ఠ చిల్లర ధరలను (ఎంఆర్‌పీ) తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. సవరించిన ధరలు 2026 నవంబర్‌ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. మందుల తయారీ సంస్థలు అక్టోబర్‌ 27 వరకు అందించిన ధరల వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. క్యాన్సర్‌ చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఉపశమనం కలిగించనుంది. తయారీ సంస్థలు కొత్త ధరలను సమర్పించినకొద్దీ జాబితాను ఎన్‌పీపీఏ అప్‌డేట్‌ చేయనుంది.

కీలక మందుల ధరల్లో భారీ తగ్గింపు

కొన్ని క్యాన్సర్‌ మందుల ధరలు గణనీయంగా తగ్గాయి. ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన అనార్జోల్‌ 1 ఎంజీ మాత్రల పది టాబ్లెట్ల ప్యాక్‌ ధర రూ.695.76 నుంచి రూ.73కు తగ్గింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ అజాసిటిన్‌ ఇంజెక్షన్‌ ధర రూ.6,337 నుంచి రూ.1,495.04కు చేరింది. అబాట్‌ హెల్త్‌కేర్‌ బెవాసిజాబ్‌ 4 ఎంఎల్‌ ఇంజెక్షన్‌ ధర రూ.21,767.70 నుంచి రూ.5,930.13కు తగ్గింది. డెబ్రమాబ్‌ ఇంజెక్షన్‌ ధర రూ.22,031.25 నుంచి రూ.5,941కు చేరింది. ఎనుటా క్యాప్సూల్స్‌ ప్యాక్‌ ధర రూ.6,578.20 నుంచి రూ.2,232కు తగ్గింది. మందుల బ్రాండ్‌, మోతాదు, ప్యాకింగ్‌ను బట్టి ధరల తగ్గింపు మారుతుంది.

పంపిణీ లాభాలపై పరిమితితో ఊరట

క్యాన్సర్‌ మందుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం 137 రకాల నాన్‌-షెడ్యూల్డ్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్‌ రేషనలైజేషన్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఎంపిక చేసిన మందుల గరిష్ఠ చిల్లర ధరలో వ్యాపార మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. ఔషధాల పంపిణీ వ్యవస్థలో అధిక లాభాలను నియంత్రించడం ద్వారా రోగులపై భారం తగ్గించడమే లక్ష్యం. రొమ్ము, ప్రోస్టేట్‌ క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే డెనోసుమాబ్‌, కీమోథెరపీ సమయంలో తెల్ల రక్తకణాల తగ్గుదలను నివారించేందుకు ఉపయోగించే పెగ్‌ఫిల్గ్రాస్టిమ్‌, కొన్ని క్యాన్సర్ల చికిత్సలో వాడే బెవాసిజుమాబ్‌ వంటి మందులు ఈ చర్య పరిధిలో ఉన్నాయి. రోగులు తమకు సూచించిన నిర్దిష్ట బ్రాండ్‌ ధరను ఎన్‌పీపీఏ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి, నవంబర్‌ 9 నుంచి వర్తించే కొత్త ధరల ప్రకారం మందులు కొనుగోలు చేయాలి.

 

#CancerDrugPrices #CancerMedicinePriceCut #NPPA #CancerTreatment #CancerPatients #DrugPriceReduction #543DrugBrands #AffordableHealthcare #Anastrozole #Azacitidine #Bevacizumab #Denosumab #Pegfilgrastim #HealthcareNews #IndiaHealthNews