మూడు రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు.
మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13, శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుందని అంచనా వేశారు. అనంతరం ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో సముద్ర వాతావరణం మారే అవకాశం ఉందని వివరించారు.
మత్స్యకారులకు నాలుగు రోజుల హెచ్చరిక
అల్పపీడనం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రఖర్ జైన్ సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా సముద్రంలో ఇప్పటికే ఉన్న మత్స్యకారులు వాతావరణ శాఖ సూచనలను గమనించాలని తెలిపారు.
ఏపీకి ఇప్పటికి ముప్పు లేదన్న అధికారులు
ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఈ అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని ప్రయాణ దిశ, తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి ప్రభావం లేకపోయినా, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు మాత్రం అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
#BayOfBengal #LowPressureArea #WeatherAlert #DepressionWarning #APWeatherUpdate #AndhraPradesh #FishermenWarning #CycloneAlert #WeatherForecast #PraharJain #DisasterManagement #BayOfBengalWeather











