Home AP చేనేత కుటుంబాలకు ఊరట, ₹ 25 వేల సాయం 71,536 కుటుంబాలకు రూ.179 కోట్ల ఆర్థిక...

చేనేత కుటుంబాలకు ఊరట, ₹ 25 వేల సాయం 71,536 కుటుంబాలకు రూ.179 కోట్ల ఆర్థిక సాయం


‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు మరో కీలక సంక్షేమ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ‘నేతన్న సేవలో’ పేరుతో ప్రారంభిస్తున్న ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చీరాలలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, పింఛన్ వంటి పథకాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం, తాజా పథకంతో వారికి మరింత భరోసా కల్పించనుంది.

చేనేత రంగం అభివృద్ధికి చర్యలు

చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. ఇందుకోసం ఏటా రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తూ ఏడాదికి రూ.420 కోట్లు వెచ్చిస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్ కూడా అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి శాఖమూరులో చేనేత–హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. చీరాల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక సభలో పాల్గొనడంతో పాటు చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

 

#NethannaSevalo #ChandrababuNaidu #NationalHandloomDay #Handloom #Weavers #Chirala #AndhraPradesh #APGovernment #WeaversWelfare #TextileIndustry #HandloomFamilies #WelfareScheme #Nethanna #TeluguNews #APNews