Home AP కరువు మండలాల ప్రకటన

కరువు మండలాల ప్రకటన

513 మండలాల్లో కరువు ఛాయలు.
268 చోట్ల తీవ్ర పరిస్థితులు.
అక్టోబర్‌ 1న అధికారిక ప్రకటన.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 1న కరువు మండలాలను అధికారికంగా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. 2026 ఖరీఫ్‌లో రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో 513 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. ఇందులో 268 మండలాల్లో తీవ్ర కరువు, 245 మండలాల్లో మోస్తరు కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

శాస్త్రీయ విధానంలో అంచనాలు

కరువు మండలాల గుర్తింపులో వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, నేలలో తేమ, పంటల సాగు విస్తీర్ణం, శాటిలైట్‌ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సెప్టెంబర్‌ 24లోగా జిల్లా కలెక్టర్లు కరువు మండలాలపై ప్రతిపాదనలు పంపనున్నారు. సెప్టెంబర్‌ 29న రాష్ట్ర స్థాయి కమిటీ వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితాపై నిర్ణయం తీసుకోనున్నారు. కరువు ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 17,916 హెక్టార్లలో ఉద్యాన పంటలు అధిక ప్రమాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడేందుకు సూక్ష్మ సేద్య విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకృతి సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఉద్యాన పంటలను కరువు ప్రభావం నుంచి రక్షించేందుకు ప్రభుత్వం రూ.190 కోట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

తాగునీటికి ప్రత్యేక కార్యాచరణ

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం తాగునీటి సరఫరాపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నానికి ప్రస్తుతం మరో రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేఘాద్రిగెడ్డకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. కరువు పరిస్థితులు మరింత తీవ్రం కాకముందే పంటలు, తాగునీటి అవసరాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.

 

#APDrought #AndhraPradeshDrought #DroughtMandals #513Mandals #ChandrababuNaidu #ElNino #RainfallDeficit #APFarmers #APAgriculture #DroughtAlert #October1 #MicroIrrigation #HorticultureCrops #Visakhapatnam #AndhraPradeshNews