Home AP పిఠాపురం అభివృద్ధికి రూ.1500 కోట్లు

పిఠాపురం అభివృద్ధికి రూ.1500 కోట్లు

కేరళలో ముగిసిన డిప్యూటీ సీఎం చికిత్స.
25 రోజుల తర్వాత రాష్ట్రానికి పవన్ రాక.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం నుంచి రెండు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.200 కోట్లతో పిఠాపురం భూగర్భ మురుగునీటి వ్యవస్థ, రూ.80 కోట్లతో గొల్లప్రోలు నీటి సరఫరా పనులు, రూ.118 కోట్లతో రోడ్డు వంతెన, రూ.323 కోట్లతో ఉప్పాడ తీర రక్షణ గోడ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. రూ.9.59 కోట్లతో ఆధునీకరించిన నాగులాపల్లి రక్షిత తాగునీటి పథకం ద్వారా 52 ఆవాసాల్లోని 97 వేల మందికి ప్రయోజనం కలగనుంది. పీఠికాపుర వనంతో పాటు పలు రహదారులు, చెరువుల అభివృద్ధి పనులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మత్స్యకారులు.. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం

మంగళవారం జరిగే బహిరంగ సభలో జల్‌జీవన్‌ మిషన్‌, అమృత్‌ పథకం కింద తాగునీటి పనులతో పాటు రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉప్పాడ మత్స్యకారులకు అధునాతన లైఫ్‌ జాకెట్లు, ఎండుచేపల తయారీ యూనిట్లు, ఐస్‌ బాక్సులతో కూడిన ద్విచక్ర వాహనాలు అందించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు సెర్ప్‌, మెప్మా ద్వారా రూ.120 కోట్ల రుణాలు అందజేయనున్నారు. 89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయనున్నారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక వసతులు, తాగునీరు, పర్యావరణం, మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కేరళలో ముగిసిన పవన్ కళ్యాణ్ చికిత్స

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సుమారు 25 రోజుల విరామం తర్వాత రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరిన పవన్‌ కళ్యాణ్ శనివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారులు, జనసేన నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పవన్‌ కళ్యాణ్ విజయవాడకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నెల రోజుల తర్వాత ఆయన ఏపీకి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో పలు అధికారిక కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఉన్న పవన్‌ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన అంశాలపై అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలిస్తున్న పవన్‌ కళ్యాణ్, తాజాగా తిరిగి రావడంతో రాబోయే రోజుల్లో ఆయన షెడ్యూల్‌పై ఆసక్తి నెలకొంది.

#PawanKalyan #Pithapuram #PithapuramDevelopment #1500CroreProjects #AndhraPradesh #JanaSena #PawanKalyanReturns #KeralaTreatment #PithapuramProjects #Uppada #Gollaprolu #FishermenWelfare #WomenSHGs #InfrastructureDevelopment #APNews