Home AP స్థానిక సమరం.. వైసీపీ లీగల్ బ్యాటిల్

స్థానిక సమరం.. వైసీపీ లీగల్ బ్యాటిల్

నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు.
అభ్యర్థులకు సాయం: సజ్జల వెల్లడి .

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని న్యాయపరంగా పర్యవేక్షించే వ్యవస్థగా లీగల్ సెల్ పనిచేయాలని సూచించారు. 2024 ఎన్నికల తర్వాత కార్యకర్తలు తప్పుడు కేసులు, దాడులు, వేధింపులు ఎదుర్కొన్నారని, ఆ సమయంలో న్యాయవాదులు అండగా నిలిచారని గుర్తుచేశారు.

ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు

ఎస్‌ఐఆర్‌ తుది ఓటర్ల జాబితా విడుదలకు ముందే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సజ్జల విమర్శించారు. కొత్త ఓటర్లకు అవకాశం కల్పించకుండా ఎన్నికలు జరిపితే వారి హక్కులకు భంగం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల సమయంలో కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, ఇతర ధ్రువపత్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

గ్రామస్థాయి నుంచి న్యాయ వ్యవస్థ

ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు న్యాయవాదుల వివరాలను సేకరించి, సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సజ్జల సూచించారు. జిల్లా లీగల్ వార్‌రూమ్‌లు, నియోజకవర్గ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసి, సమస్యలు తలెత్తిన వెంటనే రాష్ట్ర కార్యాలయానికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలను ఆధారాలతో నమోదు చేసి, అవసరమైతే ఎన్నికల సంఘం, న్యాయస్థానాలను ఆశ్రయించాలని స్పష్టం చేశారు. సున్నిత ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలపై ముందస్తు దృష్టి పెట్టాలని కోరారు.

నామినేషన్ల తిరస్కరణకు తావివ్వొద్దు

ప్రధాన కార్యదర్శులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యర్థులకు న్యాయవాదులు పూర్తి అండగా నిలవాలని కోరారు. నామినేషన్ పత్రాల పరిశీలన, అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, తిరస్కరణ జరిగితే తక్షణ న్యాయపరమైన చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు 24 గంటల న్యాయసహాయం అందించేలా కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర, జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

#YSRCP #SajjalaRamakrishnaReddy #YSRCPLegalCell #APLocalBodyElections #AndhraPradeshPolitics #ElectionLegalSupport #NominationProcess #VoterList #SIR #BCReservations #ElectionWarRoom #ElectionCounting #YSRCPNews #APPolitics