Home AP స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రణాళిక

స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రణాళిక

ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు
మూడు దశల్లో పంచాయతీలు
ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్ చేపట్టనుండగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 14 రోజుల్లో పూర్తి చేసి, పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పోలింగ్, ఫలితాలపై స్పష్టమైన గడువులు

పురపాలక ఎన్నికలను 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 16 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, మిగిలిన ఎన్నికలు పార్టీ గుర్తులతో నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. వీటిలో తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉన్నాయని ఎస్ఈసీ వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలపై పరిశీలన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

 

#AndhraPradesh #APLocalBodyElections #LocalElections #MunicipalElections #PanchayatElections #MPTCElections #ZPTCElections #StateElectionCommission #AnilChandraPunetha #ElectionSchedule #ElectionCode #AndhraPradeshPolitics