కుంకీ ఏనుగులతో అడవిలోకి మళ్లింపు.
గ్రామాల భద్రతకు ప్రత్యేక నిఘా.
చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసరాల్లో ఏనుగుల సంచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షించారు. మానవ–ఏనుగు ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏనుగుల గుంపును సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఆపరేషన్ చేపట్టాలని ఆదేశించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఏనుగుల సంచారాన్ని బట్టి ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.
13 ఏనుగులతో రైతుల్లో ఆందోళన
గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో పంటలకు నష్టం కలిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ఏనుగుల గుంపు రహదారి దాటి మంగళంపేట బీట్లోకి వెళ్లగా, మరో రెండు ఏనుగులు చిత్తూరు వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటి సంచారం పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి బృందాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని పవన్ సూచించారు.
పంట నష్టానికి తక్షణ పరిహారం
ప్రజల భద్రతతో పాటు వ్యవసాయ పంటల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏనుగుల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏనుగులను తరిమే క్రమంలో వాటికి, ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీశాఖతో పాటు పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. మానవ–ఏనుగు ఘర్షణల నివారణ, ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పవన్ ఆదేశించారు.
#PawanKalyan #Chittoor #ElephantHerd #ElephantMenace #KunkieElephants #HumanElephantConflict #AndhraPradesh #WildlifeProtection #ForestDepartment #ElephantRescue #CropDamage #FarmerCompensation #ChittoorNews #APNews #WildlifeSafety











