Home AP రంగా విగ్రహం తొలగింపుపై ఆగ్రహం

రంగా విగ్రహం తొలగింపుపై ఆగ్రహం

ఆశాకిరణ్‌ నిరసన.. పోలీసులతో వాగ్వాదం.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండల కేంద్రంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విగ్రహం ఏర్పాటు చేసిన రోజే పోలీసులు దానిని తొలగించడంతో రంగా అభిమానులు, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న రంగా కుమార్తె ఆశాకిరణ్‌ ఉండ్రాజవరం చేరుకుని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న తన తండ్రి విగ్రహాన్ని వెంటనే తమకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. శాంతియుతంగా వ్యవహరిస్తున్న తమపై లాఠీచార్జి చేయడం, మద్దతుగా నిలిచిన యువకులను అదుపులోకి తీసుకోవడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగాకు పార్టీ, కులం లేదు

విగ్రహం తొలగించిన ప్రదేశంలోనే ఆశాకిరణ్‌ బైఠాయించి నిరసన చేపట్టారు. రంగా అభిమానులకు ఎవరున్నా లేకపోయినా తాను అండగా ఉంటానని ప్రకటించారు. ఎక్కడైనా రంగా విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. వంగవీటి రంగా ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనపై అభిమానంతో ఏర్పాటు చేసే విగ్రహాలకు రాజకీయాలు, కులాన్ని ఆపాదించవద్దని కోరారు. విగ్రహాన్ని తొలగించిన ఘటనపై స్పష్టత ఇవ్వాలని, దానిని తిరిగి అప్పగించాలని ఆశాకిరణ్‌ డిమాండ్ చేశారు. దీంతో ఉండ్రాజవరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

 

#VangaveetiRanga #AshaKiran #RangaStatue #StatueRemoval #Undrajavaram #EastGodavari #VangaveetiMohanaRanga #RangaFans #KapuCommunity #APPolitics #AndhraPradesh #PoliceAction #Protest #RangaSupporters #APNews