‘స్కిల్ స్కామ్’ : వాళ్ళ ఇద్దరి పంచాయితీ కాదు గదా… జాన్ సన్ చోరగుడి
ఏపీలో జరిగింది అని చెబుతున్న ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్’ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పాతసంగతి. ‘ఆ అరెస్ట్ కు మూడేళ్లు’ అంటూ… ‘9/11 యూఎస్ ట్విన్ టవర్స్’ తరహాలో ఈ నెల మొదట్లో ‘సోషల్ మీడియా’లో కధనాలు వస్తే, వాటి ప్రజాప్రయోజనం అర్ధం కాదు. పైగా విభజనే ఒక ‘పనిష్మెంట్’ అనుకుంటే, మళ్ళీ “మేము మీ పాల పడ్డావేమీ స్వామీ..?” అని ఏపీ ప్రజలు అక్కడి రెండు పార్టీల తీరుతో విస్తుపోవలసి వస్తున్నది. ఆ పార్టీల ధోరణి చూసి, అస్సలు రాష్ట్ర ప్రజల మానసిక పరిపక్వతను, ఏ స్థాయిలో ఉంచాలని మీరు అనుకుంటున్నారని అటు టిడిపి, ఇటు వైఎస్ఆర్సీపీ ఇద్దరినీ బహిరంగంగా నిలదీయక తప్పడం లేదు. అంతేనా.. మేలు చేస్తున్నాము అనుకుని, ఆ ‘మీడియా’ చేస్తున్న హాని వారికే అర్ధం కాకపోవడం ఇందులోని విషాదం. ఈ పార్టీల ప్రభుత్వాలు, వారిని సమర్ధించే ‘మీడియా’ రెండూ అలాగే ఉంటే, అందుకు తగినట్టుగానే ప్రజలు ఉన్నారు.
బెంగుళూరులో స్థిరపడిన తెలుగు సాహితీ ప్రముఖుడు ఒకరు ‘తెలంగాణ’ ఏర్పడిన కొత్తలో నన్ను ఇలా అడిగారు- “మీరు పౌరసమాజం అని రాస్తుంటారు, అస్సలు ఏపీలో పౌర సమాజం ఎక్కడ ఉంది…?” అన్నారాయన. ఇదే మాటను పదిహేను ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వినాల్సి వచ్చింది. ఏ ఎనభై దశకంలోనో ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్ళి స్థిరపడి ‘ఇండాలజీ’ పై పలు గ్రంధ రచనలు చేస్తున్న మరో ప్రముఖుడు 2026 సెప్టెంబర్ లో కూడా ఇదే మాట అడిగారు! ఏపీలో ‘మీడియా’ ప్రభావం ఎక్కువ కావొచ్చు. విభజన తర్వాత ఏపీలో మిగిలిన రెండు పార్టీలకు వారి ఎలక్షన్ రాజకీయాలే ముఖ్యం కావొచ్చు. కానీ అవేవీ పట్టని పౌర సమాజంలో మంచీ-చెడు విచక్షణ తెలిసిన మధ్యతరగతి అలోచనపరులు ఉంటారు కదా. వాళ్ళకు అయినా ఈ ‘స్కాము’లో ‘అరెస్ట్’తో పనిలేని వాస్తవిక దృష్టి దేశంలో కొత్తగా ఏర్పడిన ఆ ‘కార్పొరేషన్’ విషయంగా ఎంతోకొంత ఉండాలి కదా, మరది ఏమైంది?
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కొత్తగా ఈ ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఎందుకు వచ్చింది? ఈ పదేళ్ళలో దానితో ఏమయింది? కాకపోతే ఎందుకు కాలేదు? ప్రస్తుత దాని ‘స్టేటస్’ ఏమిటి? ఇటువంటి సమాచార స్పృహను ప్రజలకు కలిగించాల్సిన ‘మీడియా’ ఆ అరెస్టుకు మూడేళ్లు అంటూ ఆ ఇద్దరు నాయకుల్లో ఎవరు ‘కరెక్ట్’ వద్ద ఈ చర్చను ఇక్కడి ప్రజల ఆలోచనను ఆపడం అంటే, అది- మన సమాజ భావదారిద్రం పట్ల ఈ ‘మీడియా’ చూసే చిన్నచూపు కాదూ? జరిగింది ఏమిటి? రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నకాలంలో 1985లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పడడంతో, విద్యను ఉపాధి కేంద్రిత దృష్టితో చూడడం మొదలయింది. అలా తొలి మానవ వనరుల శాఖ మంత్రి పి.వి. నరసింహా రావు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక, 1991లో మొదలైన ఆర్ధిక సంస్కరణలలోమన- ‘మానవ వనరుల’ దృష్టికి ద్రవరూపం ఏర్పడి, అన్నిఅభివృద్ధి-సంక్షేమ రంగాల్లోకి అది ప్రవహించడం మొదలయింది.
ఇప్పటి మాదిరిగా- ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’ అని గానీ, ప్రతిదాని ముందు ‘ప్రధాన్ మంత్రి…’ అంటూ ‘పబ్లిసిటీ ఫోకస్’ గానీ లేకుండానే అప్పట్లో ఈ పని మొదలయింది. ఈ దశలోనే పట్టణాభివృద్ధి, విద్యుత్తు, కమ్యూనికేషన్స్, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో ‘ఇంజనీరింగ్’ విద్య అవసరం బాగా పెరిగింది. దాంతో మానవ వనరుల అవసరాన్ని ‘డిమాండ్ – సప్లయ్’ దృష్టితో చూడడం మొదలయింది. దాంతో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి అవి లాభసాటి వ్యాపారంగా మారడంతో ఆ కోర్సుల్లోకి ప్రవేశం ఖరీదు అయింది. దాంతో 2000 నాటికి ‘క్యాంపస్ సెలక్షన్’ కొలమానంగా ఇంజనీరింగ్ కాలేజీలను ఎంపిక చేసుకుని పిల్లల్ని చేర్చడం మొదలయింది. తెలుగువాళ్లకు ఇది బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు సిఎం అయ్యాక రాజకీయంగా తనవాళ్లకు పునరావాసం ఇవ్వలేకపోతే, వాళ్ళకు ఒక ‘ఇంజనీరింగ్ కాలేజి’కి పర్మిషన్ ఇచ్చేవాడు. అలా వాటి సంఖ్య పెరిగితే, ఆ తర్వాత డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి- ‘ఫీజ్ రీ-ఎంబర్స్మెంట్’ ఇచ్చి, ఆ కాలేజీలకు ‘డిమాండ్’ పెంచారు. అయితే, దానివల్ల పెద్ద ఎత్తున అన్ని ఆర్ధిక స్థాయిల్లోని పిల్లలు ఇంజనీరింగ్ చదివి అప్పట్లో దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందారు.
డా. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యాక, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అంటే- ఆర్ధిక సంస్కరణల ఫలాలు మాత్రమే మావి అంటే కుదరదని, ఉపాధి కల్పనలో ‘ప్రైవేట్ సెక్టార్’ సింహభాగం బాధ్యతను తీసుకోవాలసిందే అనే ‘లైన్’ తీసుకున్నారు. కలకత్తాలో 12 జనవరి 2005న జరిగిన ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ భాగస్వామ్య వేదికపై ప్రధాని సింగ్ ఆ విషయం బహిరంగంగా చెప్పారు. కానీ సాంకేతిక విద్య ‘మార్కెట్’ ప్రతిపాదికగా మారాక, ఉద్యోగ అవకాశాలు ‘ఫస్ట్-కమ్-ఫస్ట్’ వడ్డన అయింది. ‘డిగ్రీ ప్లస్ స్కిల్’ ప్రాధాన్యంగా మారింది. ఇంజనీరింగ్ డిగ్రీ చాలదు ఎం.బి.ఏ., ఎం.టెక్., తప్పనిసరి అని; కాదు అమెరికా ఎం.ఎస్., ఉండాలి అనే డిమాండ్లు ఉద్యోగ మార్కెట్లో పెరిగాయి. అది అందరికీ సాధ్యమయ్యేది కాక, ఈ పోటీలోకి ఆలస్యంగా వచ్చిన అంతంత మాత్రపు చదువులున్న పేద కుటుంబ నేపధ్యం నుంచి వచ్చే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
‘యూపీఏ’ ప్రభుత్వం ‘నరేగా’ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు పలు హక్కుల చట్టాలు తెచ్చింది. ఆ తర్వాత 2008 లో ‘నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ను (ఎన్.ఎస్.డి.ఎస్) కంపెనీస్ యాక్ట్ 1956 సెక్షన్ 25 పరిధిలో ‘పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్’తో భారత ప్రభుత్వం 49% ప్రైవేట్ సెక్టార్ 51% షేర్ హోల్డింగ్ తో అమలులోకి తెచ్చింది. జాబ్ మార్కెట్ అవసరాలకు తగిన ‘స్కిల్ బ్యాంక్’ తయారీ దీని లక్ష్యం. దీనికి నోడల్ ఏజెన్సీ గా ఎన్.ఎస్.డి.ఎస్. ఉంటూ ప్రైవేట్ సెక్టార్ ద్వారా స్వల్పకాల నైపుణ్యాభివృద్ది కోర్సులు నేర్పడానికి ఇది రంగం సిద్దం చేసింది. ఆ కాలంలో ఉమ్మడి ఏపీలో 2009 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఎటువంటివో తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన తర్వాత- ‘ఎన్డీఏ’ ప్రభుత్వం విడుదల చేసిన దేశ ‘నైపుణ్యాభివృద్ది పాలసీ-2015’ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి- “మనదేశ జనాభాలో ఉన్నది 54 శాతం మంది 25 ఏళ్ల వయస్సు యువత. అయితే, రాబోయే 20 ఏళ్లలో ప్రపంచ పారిశ్రామిక రంగంలో నైపుణ్య శ్రామికుల అవసరత 4 శాతం తగ్గుతుంది, కానీ ఇండియాలో అది 32 శాతం పెరుగుతుంది. కనుక, రాబోయే పాతికేళ్లలో ఈ యువతకు ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాలు పెంచడానికి పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమం అవసరం అవుతుంది”
కీలకమైన 22 రంగాల్లో 2022 నాటికి 109.73 మిలియన్ల మంది ‘స్కిల్డ్ లేబర్’ అవసరం మనకు ఉంటుంది. అయితే, ఇండియాలో వారు ఉన్నది 4.69 శాతం మాత్రమే. అదే- యూకేలో 68%, జర్మనీలో 75%, అమెరికాలో 52%, జపాన్ లో 80%, సౌత్ కొరియాలో 92% గా ఉన్నారు’ అంటూ, 9వ తరగతి నుంచి వీరికి ‘స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు’ మొదలుపెట్టి, శిక్షణ ఇస్తూ ఇందుకోసం ‘నేషనల్ లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టం’ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ‘స్కిల్ ఇండియా-మేక్ ఇండియా’ లక్ష్యంగా ఇది మొదలయింది. ఏటా 3000 కోట్లతో మూడు అంచెలలో పనిచేసే విధంగా ‘నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్’ మొదలయింది. అందుకోసం- ‘నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ పాలసీ 2015’ పేరుతో ఒకటి జాతీయ స్థాయిలోను, రెండవది రాష్ట్రాల స్థాయిలోను, మూడు- జిల్లాల స్థాయిలోను పనిచేయాలనేది సంకల్పం. అయితే, ఈ కొత్త కార్పొరేషన్ పని ఏపీలో మొదలు అయ్యేనాటికి ఇక్కడ నెలకొన్న పరిస్థితులు పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నాయి.
ఏపీలో పదేళ్ళ విరామం తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి టిడిపి ప్రభుత్వం ఏర్పడింది. అది ఉమ్మడి రాజధాని ‘ప్రొవిజన్’ మాకు వద్దని అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి దాన్ని బెజవాడకు మార్చింది. డిల్లీలో రాష్ట్ర విభజన నిర్ణయంతో సంబంధం లేని ‘ఎన్డీఏ’ ప్రభుత్వంలో అనుభవం ఉన్న పాత వాజపేయి క్యాబినెట్ ప్రాతినిధ్యం కూడా నామమాత్రం అయింది. పైగా భారత ప్రభుత్వం 49% అయితే, ప్రైవేట్ సెక్టార్ 51% షేర్ హోల్డింగ్ భాగస్వామ్యంతో అమలుకు జరిగిన ఒప్పందంతో దానితో ఎటువంటి ‘ఆర్గానిక్ కనెక్ట్’ లేని బిజెపి ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సి వచ్చింది.
మరి పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం దీన్నికొత్త రాష్ట్రంలో ఎలా అమలు చేసింది? అనేదానిపై భారత ప్రభుత్వం ‘ఫైన్డింగ్స్’ ఏమిటి అనేది ‘స్కిల్ స్కామ్’ కేసు తర్వాత కూడా కేంద్రం అధికారికంగా వెల్లడించ లేదు. ఈ విషయంలో డిల్లీకి ఉన్న నిబద్దత ఎటువంటిదో ఇది చూస్తే అర్ధం అవుతుంది. అదలా ఉంటే, గంతకు తగిన బొంత అన్నట్టుగా, ఇక్కడి పార్టీలకు తగినట్టుగా వాటి ‘మీడియా’ ఇదేదో ఇద్దరు నాయకుల మధ్య- ‘పల్నాటి యుద్దం’ అన్నట్టుగా, జనం బుర్రల్ని తమ చేతుల్లోకి తీసుకుని, ప్రజలకు బుర్రకధ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది!











