Home AP బొత్స కుటుంబంలో కోల్డ్‌వార్‌ వైసీపీ చిన్న శ్రీను గుడ్‌బై

బొత్స కుటుంబంలో కోల్డ్‌వార్‌ వైసీపీ చిన్న శ్రీను గుడ్‌బై

చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి .

స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు చిన్న శ్రీను పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలకు రాజీనామా చేశారు. విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను ఉత్తరాంధ్రలో వైసీపీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా పనిచేశారు. 2015లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ విజయానికి కీలకంగా పనిచేశారు. అనంతరం జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024లో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

కోల్డ్‌వార్‌ ముదిరిందా.. ?

విజయనగరంలో చిన్న శ్రీను తనకంటూ ప్రత్యేక రాజకీయ బలాన్ని పెంచుకోవడంతో ఆయన ప్రాధాన్యం క్రమంగా పెరిగింది. బొత్స సత్యనారాయణ శాసన మండలికి వెళ్లిన తర్వాత జిల్లాలో పార్టీ వ్యవహారాల్లో చిన్న శ్రీను మరింత చురుకైన పాత్ర పోషించారు. భీమిలి వైసీపీ సమన్వయకర్తగా కూడా ఆయన పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ఎస్‌.కోట, ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆశ కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఇదే సమయంలో కొంతకాలంగా బొత్స సత్యనారాయణ–చిన్న శ్రీను మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీలో మేనల్లుడి ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో బలమైన సంస్థాగత నెట్‌వర్క్‌ కలిగిన నేతగా ఉన్న ఆయన పార్టీ మారడం విజయనగరంతో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. స్థానిక ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

 

#ChinnaSrinu #MajjiSrinivasaRao #ChinnaSrinuTDP #TDP #YSRCP #BotsaSatyanarayana #BotsaFamily #BotsaFamilyPolitics #ColdWar #ChandrababuNaidu #YSRCPResignation #TDPJoining #Vizianagaram #VizianagaramPolitics #NorthAndhra #AndhraPradeshPolitics #LocalBodyElections #YSRCPLeaders #TDPNorthAndhra #PoliticalShift #APPolitics