మాస్కోపై డ్రోన్లతో దండయాత్ర.
రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజు మాస్కోపై భారీ డ్రోన్ దాడి కలకలం రేపింది. రష్యా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాస్కో, పరిసర ప్రాంతాలపైకి వచ్చిన 1,600కుపైగా డ్రోన్లను కూల్చివేశారు. ఇందులో దాదాపు 450 డ్రోన్లు నేరుగా మాస్కోను లక్ష్యంగా చేసుకున్నాయని మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. దాడుల్లో కనీసం ఇద్దరు మరణించగా.. పలువురు గాయపడ్డారు.
చమురు శుద్ధి కేంద్రం టార్గెట్
డ్రోన్ దాడుల్లో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది. ఓ నివాస భవనాన్ని డ్రోన్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ ప్రకారం.. వేర్వేరు ప్రాంతాల్లో 44 ఏళ్ల మహిళతో పాటు ఓ వృద్ధుడు మరణించారు. రష్యా అధికారులు ఈ దాడిని ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నంగా అభివర్ణించారు.
యుద్ధ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్ గురి
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ దాడులను సమర్థిస్తూ.. మాస్కో ప్రాంతంలోని చమురు పరిశ్రమకు చెందిన కీలక కేంద్రం, లాజిస్టిక్స్ సదుపాయాలు దెబ్బతిన్నాయని తెలిపారు. యుద్ధానికి ఆర్థికంగా ఉపయోగపడే రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో క్రెమ్లిన్‌కు అనుకూల పార్టీలే ప్రధానంగా పోటీలో ఉండగా.. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లోనూ ఓటింగ్ నిర్వహించారు.
#Ukraine #Russia #Moscow #MoscowDroneAttack #UkraineDroneAttack #RussiaUkraineWar #RussianElections #ParliamentaryElection #DroneStrike #MoscowOilRefinery #SergeiSobyanin #Zelenskyy #RussiaNews #UkraineWar #Geopolitics











