పెన్షన్‌పై మంత్రి సవిత ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్‌లో 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,521 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అర్హుల గుర్తింపు కోసం ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. పెన్షన్ కోసం ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని, అర్హత ఉంటే ప్రభుత్వమే మంజూరు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలనలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేతన్నల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు.
అక్రమ వసూళ్లపై ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
శ్రీసత్యసాయి జిల్లాలో పెన్షన్ దరఖాస్తుల పరిశీలన సమయంలో నేతన్నల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. డీవో రమణారెడ్డి, ఏడీవో శీనా నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, మంత్రి ఆదేశాల మేరకు వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పథకం ప్రయోజనాల కోసం చేనేత కార్మికుల నుంచి అక్రమ వసూళ్లను సహించబోమని మంత్రి హెచ్చరించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, రాష్ట్రస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలనలో పాల్గొనాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి నేతన్నకూ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.











