విజయవాడ లాకప్‌డెత్
సీబీఐ దర్యాప్తుకు జగన్ డిమాండ్
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో కేవలం కింది స్థాయి పోలీసులను మాత్రమే కాకుండా, దీనికి కారణమైన ఉన్నతాధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ లాకప్‌డెత్ వెనుక పెద్దల హస్తం ఉందని, అందుకే దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు.
మే నెలలోనే రెండు విషాదాలు
ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలోనే రెండు దారుణమైన ఘటనలు జరిగాయని వైయస్ జగన్ గుర్తు చేశారు. కృష్ణలంక సీఐ వేధింపులు తట్టుకోలేక క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, తన చావుకు సీఐ కారణమంటూ అతను మరణ వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. ఆ తర్వాత మే 9వ తేదీన పోలీసులు సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. ఒకే నెలలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కృష్ణలంక పోలీసుల ప్రవర్తనే కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి ఘోరాలు జరగడం లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పోలీసుల అమానుష వైఖరి తీవ్రం
సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లినప్పటి నుంచి అతని తల్లి తన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిందని జగన్ వివరించారు. తన కొడుకు ఎక్కడున్నాడో చూపించాలని ఆమె వేడుకుంటే, పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ‘నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో’ అంటూ సిఐ హేళనగా మాట్లాడటం పోలీసుల క్రూరత్వానికి అద్దం పడుతోందని ఆక్షేపించారు. బాధిత కుటుంబం డీజీపీ కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా, అధికారులు దానిని చెత్తబుట్టలో వేశారని, బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి కాలయాపన చేశారని దుయ్యబట్టారు.
హైకోర్టు పిటిషన్‌తో నిజాలు వెలుగులోకి
పోలీసులు సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారని వైయస్ జగన్ ఆరోపించారు. ఈ క్రైమ్ బయటపడకుండా ఉండేందుకు బాధితురాలితో బేరసారాలు కూడా సాగించారని తెలిపారు. పోలీసుల తీరుపై అనుమానం వచ్చిన తల్లి జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. కోర్టు జోక్యం చేసుకోవడం, వైయస్సార్‌సీపీ అండగా నిలబడటంతో పోలీసులు తలవంచక తప్పలేదని, చివరకు సాయికృష్ణను చంపినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. తప్పు ఒప్పుకున్నారు కాబట్టే కృష్ణలంక సీఐని సస్పెండ్ చేశారని వివరించారు.
ఉన్నతాధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి
ఈ దారుణ హత్యకు కేవలం సీఐ ఒక్కడే బాధ్యుడు కాదని వైయస్ జగన్ తేల్చి చెప్పారు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు. కేవలం సీఐని సస్పెండ్ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని, సస్పెన్షన్ అనేది తాత్కాలికం మాత్రమేనని అన్నారు. ఒక 23 ఏళ్ల యువకుడిని గోళ్లు పీకి చిత్రహింసలు పెట్టి చంపితే మర్డర్ కేసు పెట్టకుండా ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. ఈ నేరంలో విజయవాడ సీపీ, డీజీపీలకు కూడా భాగస్వామ్యం ఉందని, వారందరినీ ఈ కేసులో చేర్చి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాధితులకు వైయస్సార్‌సీపీ సంపూర్ణ అండ
పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైయస్ జగన్ విమర్శించారు. ఒక చిన్న స్థాయి అధికారితో ఈ కేసుపై ఎంక్వైరీ చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉన్నతాధికారులను కాపాడటానికే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ కేసులో నిజాలు పూర్తిగా బయటకు రావాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. సాయికృష్ణ కుటుంబానికి, అలాగే ప్రాణాలు కోల్పోయిన క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ తరపున సంపూర్ణంగా అండగా ఉంటామని, కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.










