సీఎంతో ఆక్వా ఫీడ్ వ్యాపారుల భేటీ
ముఖ్యమంత్రి చొరవతో తగ్గిన ధరలు
ఆక్వా ఫీడ్ ధరను తగ్గించాలని తయారీదారులను ముఖ్యమంత్రి కోరడం, వారు సానుకూలంగా స్పందించడంతో రైతులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించింది. కేజీ ఆక్వా ఫీడ్ ధరను రూ.4 తగ్గించేందుకు తయారీదారులు అంగీకారం తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం కేజీ రూ.112 గా ఉన్న ఫీడ్ ధర రూ.108 కి తగ్గనుంది. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అమరావతిలో ఆక్వా, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతో పాటు ఫీడ్ తయారీదారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో ఒక ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ 20 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. నివేదిక వచ్చిన తర్వాత ధరలపై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50 లకే ఇస్తున్నందుకు రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వా సాగును శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం పొడవునా విస్తరించేలా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రైతులు కొనియాడారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన రైతులు
గత ప్రభుత్వ హయాంలో ఆక్వా ఫీడ్ ధరలు ఆరు సార్లు పెంచారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పట్లో ధరల తగ్గింపుపై నాటి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదని గుర్తు చేశారు. 2019 లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.107.80 కి చేరిందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీడ్ ధర రూ.5.80 తగ్గించిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు రైతుల ముసుగులో రాజకీయాలు చేశారని, తాము ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ఆక్వా రంగాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని రైతులు మరింత లాభాలు పొందేలా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో పొగాకు మార్కెట్ పరిస్థితులు, మామిడి దిగుబడులు, మార్కెటింగ్ అవకాశాలపై కూడా చర్చించారు. మామిడి ధరల పరిస్థితులపై అధికారులు ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందజేశారు. రొయ్యలు, చేపల రైతుల సమస్యలతో పాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాచరీల ప్రతినిధులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.










