పబ్లిక్ డొమైన్‌లో తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలి
అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు
విద్యాశాఖ అధికారుల సమీక్షలో మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజుల వివరాలను తప్పనిసరిగా నోటీస్ బోర్డులపై, పబ్లిక్ డొమైన్‌లో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. పాఠశాలల అనుమతుల్లో ఉండే అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు. గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన విద్యావ్యవస్థ బలోపేతానికి పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.
అనాథ పిల్లలకు తల్లికి వందనం భరోసా
రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం ప్రయోజనాలను పూర్తిగా వర్తింపజేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. తల్లిదండ్రులు, గార్డియన్లు లేని అనాథ పిల్లలకు జిల్లా కలెక్టర్ల ద్వారా నిధుల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. ఈ నిధులను నేరుగా ఆయా పిల్లల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం
రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని మెగా పీటీఎం నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కేజీబీవీలు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికల కోసం 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న రెండు లక్షల మందికి పైగా విద్యార్థులకు కూడా కిట్లను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
తెలుగు అకాడమీ పుస్తకాలు ఇక ఆన్‌లైన్‌లో
తెలుగు అకాడమీ పుస్తకాలను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఈ పుస్తకాల విక్రయాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కనీసం 95 శాతానికి తగ్గకుండా చూడాలని, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించాలని, హైస్కూళ్లలో క్రోమ్ బుక్స్‌తో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.










