చక్కెర, ఉప్పు, కొవ్వుపై హెచ్చరికలేవి?
అనుమతులకు పరిమితులపై ప్రశ్నలు.
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉంటే హెచ్చరిక లేబుళ్లు ముద్రించే అంశంపై సుప్రీంకోర్టు ఎఫ్ఎస్ఎస్ఏఐని నిలదీసింది. ఏ స్థాయి దాటితే ఆహారాన్ని ‘హై’ షుగర్, ‘హై’ సాల్ట్, ‘హై’ ఫ్యాట్‌గా నిర్ణయిస్తారో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించింది. గత నెల ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఎరుపు రంగు హెచ్చరిక గుర్తులను ప్రతిపాదించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదకర పోషకాలు అధికంగా ఉంటే ముందు భాగంలో ఎర్రటి హెక్సాగన్ గుర్తు పెట్టాలని సూచించింది. ఇందుకు 2024లో ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ విడుదల చేసిన భారతీయుల ఆహార మార్గదర్శకాలను ఆధారంగా తీసుకుంటున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ కోర్టుకు తెలిపింది.
రెండు దశల విధానంపై అభ్యంతరం
ఆహార భద్రత అంశాన్ని ‘జాతీయ ప్రయోజనం’గా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ తొలుత రెండు దశల్లో హెచ్చరిక లేబుళ్లను అమలు చేయాలని ప్రతిపాదించింది. మొదటి దశలో చక్కెర, ఉప్పు, కొవ్వులో కనీసం రెండింటి పరిమితి అధిగమించిన ఉత్పత్తులకు హెచ్చరిక ఇవ్వాలని పేర్కొంది. రెండో దశలో ఒక్క పోషకం అధికంగా ఉన్నా లేబుల్ పెట్టాలని భావించింది. ఒక్క పోషకం అధికంగా ఉన్నప్పుడే ఎందుకు హెచ్చరిక ఇవ్వకూడదని కోర్టు ప్రశ్నించింది. కోర్టు సూచనతో రెండు దశల బదులు ఒకేసారి విధానం అమలు చేసే అంశాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశీలించనున్నట్లు కేంద్రం తెలిపింది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌పైనా దృష్టి
విచారణలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను సాధారణ ప్యాకేజ్డ్ ఫుడ్‌తో సమానంగా చూడకూడదనే వాదన కూడా వచ్చింది. ఇలాంటి ఉత్పత్తులకు మరింత స్పష్టమైన హెచ్చరిక అవసరమని సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ సూచించారు. మరోవైపు ఆహార పదార్థాలపై హెచ్చరికల విషయంలో తయారీ సంస్థల ప్రభావం ఉందా అన్న ప్రశ్నను గత విచారణలోనే సుప్రీంకోర్టు లేవనెత్తింది. ఏ ఆహారాన్నీ నిషేధించడం తమ ఉద్దేశం కాదని, ప్రజలు ముఖ్యంగా పిల్లలు తాము తీసుకునే ఆహారంలో చక్కెర, ఉప్పు, కొవ్వు స్థాయిని తెలుసుకుని నిర్ణయం తీసుకునేలా చేయడమే లక్ష్యమని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మరింత సమాచారం కోరుతూ త్వరలో వివరణాత్మక ఆదేశాలు జారీ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
#SupremeCourt #FSSAI #PackagedFood #WarningLabels #FoodSafety #FoodLabelling #HighSugar #HighSalt #HighFat #SugarWarning #SaltWarning #FatWarning #PackagedFoodIndia #FSSAIRegulations #FoodSafetyIndia #ICMR #NIN #DietaryGuidelines #UltraProcessedFood #ChildHealth #PublicHealth #Nutrition #SupremeCourtIndia #IndiaNews











