Home Telangana ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచే కుట్ర?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచే కుట్ర?

కేసీఆర్‌ ఆదేశాలపై సమగ్ర విచారణ.
అసెంబ్లీలో బీఆర్ఎస్‌పై సీఎం ఆగ్రహం.

అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. స్పీకర్ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌పై జరిగిన మాటల దాడిని సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఘటన తర్వాత కేసీఆర్ స్వయంగా స్పీకర్‌ను కలిసి క్షమాపణ చెబుతారని ప్రజాస్వామ్యవాదులు భావించారని, కానీ ఆయన అలా చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ స్పష్టం చేశారు. ఆ చర్చ జరిగితే తమ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులను ఉసిగొలిపి సభకు పంపించారని ఆరోపించారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా దళితుడైన స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని సీఎం పేర్కొన్నారు.

కుట్రదారులపై క్రిమినల్ చర్యలు

అసెంబ్లీ వద్ద జరిగిన వరుస ఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపడుతుందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన ఘటన, విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు, ఇతర పరిణామాలపై పూర్తి వివరాలు సేకరిస్తామని చెప్పారు. కుట్రకు ప్రణాళిక రూపొందించినవారితో పాటు దాన్ని అమలు చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంటరానితనం ఆరోపణలపై విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్‌కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశం నుంచి అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాల వరకు మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతామని వెల్లడించారు. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. సభలో ప్రతి సభ్యుడు బాధ్యతగా వ్యవహరించి ప్రజా సమస్యలపై చర్చకు సహకరించాలని సీఎం కోరారు.

శుద్ధి నేలది కాదు.. ఆలోచనలది

దళిత సభాపతిని అవమానించిన ఘటనతో దళిత సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌ను దూషించడాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గాల ప్రజలు డప్పులతో నిరసన తెలిపారని చెప్పారు. తాము ఎవరినీ తిట్టలేదని, దాడి చేయలేదని.. దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని మాత్రమే కోరారని పేర్కొన్నారు. అయితే ఆ నిరసన జరిగిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం మరింత వివాదానికి దారితీసిందని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం కాదని, అంటరానితనం ఆలోచనలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, అంతరాలను తొలగించాల్సిన సమయం వచ్చిందన్నారు. మల్లికార్జున ఖర్గే, ప్రసాద్‌కుమార్‌కు జరిగిన అవమానాలు వ్యక్తులకు జరిగినవి కావని, కులవివక్ష, అణచివేతకు సంబంధించిన అంశాలని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని సీఎం హెచ్చరించారు.

 

#KCR #RevanthReddy #Erravalli #ErravalliFarmhouse #KCRConspiracy #RevanthReddySpeech #BRS #BRSControversy #TelanganaAssembly #AssemblyControversy #GaddamPrasadKumar #SpeakerControversy #AssemblyGateIncident #BRSAssembly #TelanganaPolitics #CriminalAction #GovernmentInquiry #DalitSpeaker #CasteDiscrimination #KCRNews #RevanthReddyNews #TelanganaNews