అమ్మపై వ్యాఖ్యలతో ఆవేదన.
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధుసూదన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పంచాయతీరాజ్ మంత్రి దనసరి సీతక్క తీవ్రంగా ఖండించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని సీతక్క సభలో ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న సమయంలో సీతక్క కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కర్చీఫ్‌తో కళ్లను తుడుచుకుంటూ కొద్దిసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సభలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మధుపై చర్యలకు సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధుసూదన్‌ను వెంటనే శాసనమండలి నుంచి సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మధుసూదన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. గత ఐదేళ్లుగా సీతక్క తనకు రాఖీ కడుతున్నారని గుర్తుచేశారు. తనను సోదరుడిగా భావించే సీతక్క సభలో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తాను కూడా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయానని చెప్పారు. మధుసూదన్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీర్మానం చేసి శాసనమండలికి పంపిస్తామని స్పష్టం చేశారు.
#Seethakka #GaddamPrasadKumar #TelanganaAssembly #TelanganaPolitics #TattaMadhusudhan #BRS #BRSMLC #SeethakkaSpeech #EmotionalMoment #SpeakerTears #TelanganaSpeaker #GuttaSukhenderReddy #AssemblyControversy #PoliticalControversy #SeethakkaTears #TelanganaNews #BRSControversy #CongressTelangana #AssemblyNews











