Home General 7 లక్షల మంది.. 8 వేల గదులు!

7 లక్షల మంది.. 8 వేల గదులు!

ఢిల్లీ విద్యార్థులకు హాస్టల్‌ కష్టాలు.
ప్రైవేట్‌ పీజీలే దిక్కు.. భద్రతే ప్రశ్నార్థకం.

చదువుల కోసం దేశ రాజధానికి వచ్చే విద్యార్థులకు హాస్టల్‌ భద్రతే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆశతో ఢిల్లీ చేరిన యువతకు సరైన వసతి దొరకక ప్రైవేట్‌ పీజీలను ఆశ్రయించాల్సి వస్తోంది. కానీ నిబంధనలు పాటించని భవనాలు, అనుమతులు లేని అదనపు అంతస్తులు, బలహీనమైన నిర్మాణాలు వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ దుస్థితికి అద్దం పడుతోంది. వేలాది మంది విద్యార్థులు హాస్టల్‌ కోసం ఎదురుచూస్తుంటే, అందుబాటులో ఉన్న గదులు మాత్రం చాలా తక్కువ. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వసతులే దిక్కవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన వ్యవస్థే వారి ప్రాణాలకు ముప్పుగా మారితే బాధ్యత ఎవరిది? ఢిల్లీ విషాదం ఇప్పుడు ఒక్క భవనం కథ కాదు.. దేశవ్యాప్తంగా విద్యార్థుల వసతి భద్రతపై మోగిన ప్రమాద ఘంటిక.


ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన విద్యార్థుల వసతి భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌కు సమీపంలోని ఈ ప్రాంతంలో వందలాది మంది విద్యార్థులు ప్రైవేట్‌ పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో దశాబ్దాల నాటి ‘హాస్టల్‌ డేజ్‌’ భవనం కుప్పకూలింది. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఒక వారంలో ఢిల్లీలోని అన్ని పీజీలు, ప్రైవేట్‌ హాస్టళ్లను తనిఖీ చేయాలని ఎంసీడీని ఆదేశించింది. భవనాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయా? అక్రమాలకు బాధ్యులైన అధికారులు ఎవరు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలను విచారణలో తేల్చాలని స్పష్టం చేసింది. ప్రతి ప్రైవేట్‌ హాస్టల్‌లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారో లెక్కించాలని, ఇలాంటి వసతులపై ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉందా అనే వివరాలు ఇవ్వాలని కోర్టు కోరింది. అక్రమంగా అంతస్తులు పెంచడం, బలహీనమైన పునాదులపై అదనపు నిర్మాణాలు చేపట్టడం విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

హాస్టల్‌ గదులు తక్కువ.. సమస్య భారీ

ఢిల్లీ యూనివర్సిటీలో రెగ్యులర్‌, ప్రొఫెషనల్‌, ఓపెన్‌ లెర్నింగ్‌ కోర్సుల్లో 7 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో సుమారు 2.5 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అయితే యూనివర్సిటీ పరిధిలో హాస్టల్‌ సౌకర్యం చాలా పరిమితంగా ఉంది. అందుబాటులో ఉన్న గదులు సుమారు 7,000 నుంచి 8,000 మాత్రమే అని నివేదికలు చెబుతున్నాయి. అంటే నమోదు చేసుకున్న విద్యార్థుల్లో సుమారు 31 మందికి ఒకరికే హాస్టల్‌ గది దక్కే పరిస్థితి ఉంది. 2025లో 30 వేల మందికి పైగా అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు హాస్టళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 10 శాతంలోపే సీట్లు లభించాయి. దీంతో బయట ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ప్రైవేట్‌ పీజీలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ వీసీ యోగేశ్‌ సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాళ్లకు వసతి సదుపాయాలను సమీక్షించాలని సూచించారు. మరోవైపు సత్య నికేతన్‌ ఘటన తర్వాత ఎంసీడీ ఐదుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భవనం యజమాని హరిరామ్‌ బన్సాల్‌ను రాజస్థాన్‌లోని భివాడీ నుంచి అరెస్టు చేశారు. భవనం గ్రౌండ్‌ ప్లస్‌ నాలుగు అంతస్తులతో ఉండగా, మొదట గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌కు మాత్రమే అనుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు హాస్టల్‌ కొరత తీర్చకపోతే అక్రమ పీజీలపై ఆధారపడే పరిస్థితి కొనసాగుతుంది. భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే ఇలాంటి విషాదాలు మళ్లీ జరిగే ప్రమాదం ఉంది.

 

#DelhiHostelCrisis #DelhiStudents #DelhiHostelShortage #DelhiUniversity #DUStudents #StudentAccommodation #PrivatePGs #DelhiPGs #HostelSafety #StudentSafety #SatyaNiketan #DelhiBuildingCollapse #DelhiHighCourt #MCD #IllegalPGs #UnsafeBuildings #StudentHousing #DelhiSouthCampus #EducationNews #DelhiNews #IndiaNews