ఎల్పీజీ బుకింగ్ గ్యాప్ 25 రోజులకు కుదింపు
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలో దేశీయ ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్కు 25 రోజుల వ్యవధిని ఒకే విధంగా అమలు చేయాలని కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 7 నుంచే తక్షణం అమల్లోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు కొత్త నిబంధనను అమలు చేయనున్నాయి. గతంలో పట్టణ వినియోగదారులకు 25 రోజులు, గ్రామీణ వినియోగదారులకు 45 రోజుల బుకింగ్ గ్యాప్ ఉండేది. 2026 ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరగడంతో డిమాండ్ను నియంత్రించేందుకు ఈ తాత్కాలిక నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎల్పీజీ రీఫిల్ బ్యాక్లాగ్ గణనీయంగా తగ్గడంతో గ్రామీణ వినియోగదారులపై ఉన్న అదనపు 20 రోజుల పరిమితిని కేంద్రం తొలగించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ అవసరమైన వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది.
సరఫరా మెరుగుదలతో నిబంధన మార్పు
కేంద్ర మంత్రి సురేశ్ గోపీ కూడా ఈ మార్పును ధ్రువీకరించారు. దేశీయ ఎల్పీజీ వినియోగదారులందరికీ ఇకపై 25 రోజుల రీఫిల్ బుకింగ్ వ్యవధినే వర్తింపజేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని ఆయన తెలిపారు. పశ్చిమాసియా ఘర్షణల సమయంలో సరఫరాపై ఏర్పడిన ఒత్తిడి కారణంగానే పట్టణ, గ్రామీణ వినియోగదారులకు వేర్వేరు గ్యాప్లు విధించాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పుడు సరఫరా వ్యవస్థలో పరిస్థితులు మెరుగుపడటంతో ప్రాంతాల ఆధారంగా ఉన్న తేడాను తొలగించి దేశవ్యాప్తంగా ఒకే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ కుటుంబాలకు ఉపశమనంగా మారనుంది. గతంలో 45 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇకపై 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో గృహ అవసరాలకు ఎల్పీజీపై ఆధారపడే వినియోగదారులకు రీఫిల్ లభ్యత విషయంలో వెసులుబాటు పెరగనుంది. సరఫరా ఒత్తిడి తగ్గడం, బ్యాక్లాగ్లు గణనీయంగా తగ్గడం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
#LPG #LPGBooking #LPGCylinder #LPGRefill #LPGBookingGap #LPGConsumers #RuralLPG #LPGSupply #LPGIndia #DomesticLPG #IndianOil #BPCL #HPCL #PetroleumMinistry #SureshGopi #LPGRules #GasCylinder #ConsumerRelief #IndiaNews #GoodNews











