విజయవాడలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నిర్వహించిన భేటీలో పీఆర్సీ కమిషనర్ నియామకం, రెండు డీఏల విడుదల, పెన్షనర్ల అదనపు పింఛను పునరుద్ధరణ, సరెండర్ లీవుల మంజూరు, ఎంప్లాయిస్ హెల్త్ కార్డు వినియోగం వంటి నిర్ణయాలపై జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉద్యమానికి స్పందించి సానుకూల నిర్ణయాలు ప్రకటించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. అయితే ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్), బకాయిల చెల్లింపుపై స్పష్టత, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పలు జిల్లాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఆర్‌పై సీఎం ఇచ్చిన హామీపై నమ్మకంతో ప్రస్తుత ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ విజయానికి పూర్తి హక్కుదారులు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులేనని జేఏసీ స్పష్టం చేసింది.
30 డిమాండ్లపై గడువు
మిగిలిన 30 ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ ద్వారా త్వరగా పరిష్కరించాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఐఆర్‌ను వీలైనంత త్వరగా ప్రకటించి అమలు చేయడంతో పాటు బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిషన్ ఇప్పటికే ఆలస్యమైనందున ఆరు నెలల్లో నివేదిక సమర్పించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని తీర్మానించింది. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలు పూర్తిగా అమలయ్యే వరకు జేఏసీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపింది. ఉద్యోగుల హక్కులకు భంగం కలిగితే మళ్లీ ఉద్యమ బాట పడతామని హెచ్చరించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగితే నిర్మాణాత్మక సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల్లో విజయోత్సవ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
#APEmployees #APJACAmaravati #APEmployeesAgitation #EmployeeAgitation #AndhraPradeshEmployees #APGovernmentEmployees #PRCCommission #DARelease #InterimRelief #APEmployeesDemands #EmployeeArrears #Pensioners #EmployeeHealthCards #SurrenderLeave #SecretariatEmployees #OutsourcingEmployees #APGovernment #ChandrababuNaidu #APPolitics #APNews











