Home Telangana వెయ్యి రోజుల పాలనపై హరీశ్‌ రావు ఫైర్‌!

వెయ్యి రోజుల పాలనపై హరీశ్‌ రావు ఫైర్‌!

గ్యారెంటీల నుంచి రైతు సమస్యల వరకు
హామీలు ఎక్కడంటూ కాంగ్రెస్‌పై విమర్శలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కౌడిపల్లిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికలకు ముందు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెయ్యి రోజులు గడిచినా హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. రూ.4 వేల పెన్షన్‌, రూ.15 వేల రైతుబంధు, మహిళలకు నెలకు రూ.2,500, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీల హామీలను ప్రస్తావించారు. రైతుబీమా నిలిచిపోయిందని, రైతుబంధు నిధులు అందడం లేదని విమర్శించారు. 24 గంటల విద్యుత్‌ స్థానంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎరువుల ధరలు పెరిగాయని, పంటల కొనుగోళ్లలో సమస్యలు ఉన్నాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని, బసవేశ్వర, సంగమేశ్వర, ఘనపూర్‌ ఆనకట్ట, నర్సాపూర్‌–మెదక్‌ కాలువ పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.

రుణమాఫీపై సీఎంకు సవాల్‌

కౌడిపల్లిలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని హరీశ్‌రావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేరుగా సవాల్‌ విసిరారు. పోలీసుల భద్రత లేకుండా కౌడిపల్లికి వచ్చి అందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, జరగలేదని తేలితే సీఎం రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీకి వెళ్తున్నారని, రాష్ట్రానికి మాత్రం ప్రయోజనం కనిపించడం లేదని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మహాలక్ష్మి, పెన్షన్లు, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మరోవైపు కౌడిపల్లి పీఏసీఎస్‌లో వడ్లు కొనకుండానే కోటి రూపాయల అక్రమాలు జరిగాయని, మహమ్మద్‌నగర్‌ పీఏసీఎస్‌లోనూ అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. చేయని తప్పుకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ అర్షద్‌ను బలిచేసి, అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల రైతులకు బంధు, బీమా, భూముల విక్రయాల్లో ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపిస్తూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఓడిస్తారని హరీశ్‌రావు అన్నారు.

 

#HarishRao #TelanganaPolitics #CongressGovernment #RevanthReddy #Congress1000Days #SixGuarantees #FarmerIssues #LoanWaiver #RythuBandhu #TelanganaFarmers #BRSp #TelanganaCongress