Home General గ్యాస్ వినియోగదారులకు షాక్ – సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

గ్యాస్ వినియోగదారులకు షాక్ – సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

54

30లోగా కెవైసీ, బయోమెట్రిక్ చేసుకోవాలి

వంటగ్యాస్ వాడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఉజ్జ్వల పథకంతోపాటుగా, సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు అందరూ జూన్ 30 లోగా తమ ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. గత ఏడాది కాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా చాలా మంది దీనిని పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ నెలాఖరును ఆఖరి గడువుగా విధిస్తూ గట్టి నిర్ణయం తీసుకుంది.

గడువు దాటితే సబ్సిడీ డబ్బులు రావు
ప్రభుత్వం నిర్ణయించిన జూన్ 30 గడువు లోగా బయోమెట్రిక్ పూర్తి చేయని వారి ఖాతాలలో సబ్సిడీ డబ్బుల జమ నిలిచిపోతుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత ఎప్పుడైనా ఈ-కేవైసీ చేసుకుంటే ఆ తేదీ తర్వాత తీసుకునే సిలిండర్లకు మాత్రమే మళ్లీ సబ్సిడీ వర్తిస్తుంది. గడువు ముగిసిన రోజు నుండి బయోమెట్రిక్ పూర్తయ్యే మధ్య కాలంలో బుక్ చేసుకునే సిలిండర్లపై వచ్చే సబ్సిడీని వినియోగదారులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే బయోమెట్రిక్ కాలేదనే నెపంతో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరాను మాత్రం ఆపకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

పెరిగిన ధరలతో సామాన్యుడిపై భారం
పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో గ్యాస్ ధరలను సుమారుగా 90 రూపాయల వరకు పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధర 994 రూపాయలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వల లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీ ఇస్తుండగా మిగిలిన సాధారణ వినియోగదారుల ఖాతాల్లో స్వల్పంగా 40 రూపాయల వరకు మాత్రమే నగదు జమ అవుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది.

సులభంగా ఈ-కేవైసీ చేసుకునే విధానాలు

గ్యాస్ కనెక్షన్లను ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తూ ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ వంటి మూడు రకాల పద్ధతులలో ఈ-కేవైసీని పూర్తి చేస్తున్నారు. వినియోగదారులు నేరుగా గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా తమ ఇంట్లోనే ఉండి ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి కాకుండా నేరుగా తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కూడా బయోమెట్రిక్ ఇవ్వవచ్చు. ప్రస్తుతం కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలోనే సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ పొందడానికి వినియోగదారులు వెంటనే ఈ పని పూర్తి చేసుకోవాలి.