రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చే కుట్ర
సర్కారు నిర్ణయంపై వైసీపీ ఘాటు విమర్శలు
విశాఖపట్నం బీచ్ ప్రాంతాల్లో బీచ్ సాక్స్ పేరుతో బహిరంగంగా మద్యం విక్రయాలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వైసీపీ తప్పుబట్టింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. బీచ్‌ల వెంట గుడిసెలు ఏర్పాటు చేసి మద్యం అమ్మడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ దారుణమైన నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా ఉందని ఆయన విమర్శించారు.
పవిత్ర విశాఖ బీచ్‌ను బార్‌గా మార్చొద్దు
విశాఖపట్నం బీచ్ రోడ్డు ప్రకృతి సౌందర్యానికి, కుటుంబాలు ప్రశాంతంగా గడిపే నగరానికి ప్రతీక అని రాజీవ్ గాంధీ అన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు గంగమ్మ తల్లి ఆలయం, కాళీమాత ఆలయం, శివాలయం, టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం వంటి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పవిత్ర ప్రాంతాలను బార్‌లుగా మార్చే ప్రయత్నం హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం సంపాదించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. సమీపంలోనే విద్యాసంస్థలు ఉండగా, విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సింది పోయి ఇటువంటి తప్పుడు సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదన్నారు. బీచ్ సాక్స్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.











