ఉదయం 8 గంటలకే క్లాసులంటూ యాజమాన్యం హఠాత్ నిర్ణయం
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో భగ్గుమన్న విద్యార్థి లోకం
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండా, ఏకపక్షంగా కాలేజీ సమయాలను మార్చడాన్ని నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు మంగళవారం ఉదయం రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నాకు దిగారు.
సాధారణంగా కాలేజీ తరగతులు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, యాజమాన్యం ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా ఉదయం 8 గంటలకే క్లాసులు ప్రారంభం అవుతాయంటూ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఈ ఆకస్మిక మార్పుతో బాపట్ల జిల్లాలోని వివిధ సుదూర ప్రాంతాలైన చీరాల, రేపల్లె, పొన్నూరు, తెనాలి మరియు రూరల్ గ్రామాల నుండి ప్రతిరోజూ బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణించే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంత ఉదయాన్నే కాలేజీకి చేరుకోవడం సాధ్యం కాదని, కనీసం బస్సుల టైమింగ్స్ కూడా సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులంతా ఏకమై కాలేజీ గేటు వెలుపల ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీనితో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
తమతో చర్చించకుండా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, పాత సమయాలనే కొనసాగించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. యాజమాన్యం దిగివచ్చి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.










