నదుల అనుసంధానమే చంద్రబాబు లక్ష్యం.
ఏపీలోని అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లిలో బుధవారం ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి జలహారతి ఇచ్చిన సీఎం.. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకురావడం గొప్ప జల విజయమన్నారు. నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ గోదారమ్మ ఉత్తరాంధ్రకు చేరిందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి కరువు ప్రాంతమైన మార్కాపురానికి నీరు అందించామని గుర్తుచేశారు. పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చి ప్రతి ఎకరాకు నీరు అందించడం ద్వారా తెలుగుతల్లి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు పేర్కొన్నారు.
నీరుంటేనే అభివృద్ధి
సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన చంద్రబాబు.. నీరు ఉంటేనే రైతులకు భద్రత, భవిష్యత్తుపై భరోసా ఉంటుందని అన్నారు. నీటి లభ్యతతో పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, 2019 నాటికి 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రతి సోమవారం పోలవరం పనులను పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరానికి శాపంగా మారిందని ఆరోపించారు. ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరానికి శాపవిముక్తి కలిగిందని చెప్పారు. 2028 నాటికి 12 ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.
ఉత్తరాంధ్రకు కొత్త భవిష్యత్తు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రాంతానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తున్నామని, భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ఇక ఉత్తమ ఆంధ్రగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర భయంతో వణికిపోయిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయని ప్రభుత్వం.. రుషికొండపై రూ.500 కోట్లతో భవనం నిర్మించిందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. వైసీపీ విధానం విధ్వంసమేనని, ఇప్పుడు తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కూడా క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తయినా, అమరావతి నిర్మాణం పూర్తయినా తమ ఘనతేనని వైసీపీ చెప్పుకుంటుందేమో అంటూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#ChandrababuNaidu #GodavariWaters #NorthAndhra #Polavaram #PolavaramLeftCanal #RiverLinking #IrrigationProjects #AndhraPradesh #Anakapalli #NorthAndhraDevelopment #APPolitics #Godavari #Irrigation #APGovernment











