Home AP అభిమాని కోసం కదిలిన పవన్

అభిమాని కోసం కదిలిన పవన్

43

ఓరుగల్లు పర్యటనకు జనసేనాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన నమ్మకమైన అభిమాని నిరంజన్ అనే పదిహేడేళ్ల బాలుడిని ఆయన స్వయంగా పరామర్శించారు. హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో ఉన్న బాలుడి నివాసానికి పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న నిరంజన్‌ను ఆప్యాయంగా హత్తుకుని ముద్దాడారు. చిన్ననాటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమని బాలుడు చెప్పిన మాటలకు ఆయన తీవ్రంగా చలించిపోయారు. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

మనోధైర్యం నింపిన అపూర్వ క్షణాలు
నిరంజన్ తను ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా పాటలకు వేసిన డాన్స్‌ల వీడియోలను చూపించగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నిరంజన్ మనోధైర్యాన్ని పెంచేందుకు తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శేషవస్త్రాన్ని బాలుడికి కప్పారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో పూజ చేయించిన అమ్మవారి వెండి ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేసి ధైర్యం చెప్పారు. నిరంజన్ చూపుతున్న ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే కోలుకోవాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని, భద్రకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.

మానవత్వంతో జీవనోపాధికి హామీ
ఈ ముఖాముఖి పర్యటనలో నిరంజన్ తనకు ఒక కుక్క పిల్లను పెంచుకోవాలని ఉందని కోరగా, తప్పకుండా కొని పంపిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే కుక్కను పెంచుకోవడానికి ఇంటి యజమానుల అనుమతి కావాలని బాలుడి తండ్రి తెలపడంతో, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ఇంటి యజమానులను పిలిపించి మాట్లాడి ఒప్పించారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పని చేసేవాళ్లమని చెప్పగా, వారి శాశ్వత జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఒక కొత్త క్యాంటిన్ ఏర్పాటు చేయించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులను ఆదేశించారు.

భద్రకాళి దర్శనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు
అభిమానిని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలను తన జీవితాంతం హృదయంలో నిలుపుకుంటానని భావోద్వేగంగా ప్రకటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన ముఖ్య నాయకులు శంకర్ గౌడ్, శ్రీరామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం, ఆర్ కె సాగర్ పాల్గొన్నారు.