విశ్వ మహోత్సవానికి శ్రీకారం
హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా 2027 ఫిబ్రవరి 27న నిర్వహించనున్న భగవద్గీత విశ్వ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం లోగో, వెబ్సైట్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎం. రాధాకృష్ణ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఫెమినా మిస్ ఇండియా 2026 విజేత ఇందు ఫాల్గుణి, నేపథ్య గాయకుడు పవన్ చరణ్, ప్రముఖ ప్రవచనకర్త అమరవాది శేషయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సత్యప్రసాద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

18 దేశాలు.. 18 భాషల్లో పఠనం
భగవద్గీత విశ్వ మహోత్సవంలో 18 అధ్యాయాలను 18 దేశాల్లో 18 భాషల్లో ఒకేసారి పఠించడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, దుబాయ్ సహా 18 దేశాలకు చెందిన విదేశీయులు ఇప్పటికే భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. మహోత్సవం రోజున ఆయా దేశాల ప్రతినిధులు తమ భాషల్లో శ్లోకాలను ఆలపించనున్నారు. భగవద్గీతను అంతర్జాతీయ స్థాయిలో ఇంత భారీగా ఆలపించే కార్యక్రమం ఇదే తొలిసారి అని నిర్వాహకులు కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గీతా సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

భావితరాలకు గీతా సందేశం
ప్రముఖ ప్రవచనకర్త అమరవాది శేషయ్య భగవద్గీత శ్లోకాల్లోని ముఖ్యమైన అంశాలను వివరించారు. భావితరాలకు భగవద్గీత విలువైన మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు జీవన విలువలు, కర్తవ్యబోధ, మానవతా సందేశాన్ని గీత అందిస్తుందని వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారు శ్లోకాలను నేర్చుకుని ఒకే వేదికపై ఆలపించడం భారతీయ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి వేదికగా జరగనున్న ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.











