Home AP చిన్నారి ఆచూకీపై హోంమంత్రి భరోసా

చిన్నారి ఆచూకీపై హోంమంత్రి భరోసా

57

తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె అన్నారు. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న ఆ కన్నతల్లి బాధ వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. పాప మిస్సయిన విషయం తెలిసిన వెంటనే పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పారు. చిన్నారి సురక్షితంగా ఇంటికి చేరేలా అన్ని రకాల గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కుటుంబ సభ్యులకు వివరించారు.

ముమ్మరంగా సాగుతున్న పోలీసు గాలింపు
చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం టెక్నికల్ ఆధారాలను సేకరిస్తున్నామని హోం మంత్రి తెలిపారు. సాంకేతిక సమాచారంతో పాటు గ్రౌండ్ లెవెల్‌లో వివిధ ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయని చెప్పారు. పాప మిస్సింగ్ కేసు విషయంలో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం వహించలేదని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఈ దర్యాప్తు అంశంపై తానే స్వయంగా మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పాప దొరికే వరకూ ఈ గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అసత్య ప్రచారాలపై కఠిన హెచ్చరికలు
ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో రకరకాల అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని హోం మంత్రి అనిత మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. తక్షణమే అలాంటి అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆమె హెచ్చరించారు. చిన్నారి అదృశ్యంపై తప్పుడు రాతలు రాసే వారిపై, పుకార్లు పుట్టించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.