పోరాట స్ఫూర్తితో స్థానిక ఎన్నికలు.
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసైనికులు, వీర మహిళలు గతంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, దాడులను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఈసారి ఎన్నికల్లో బలంగా నిలవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు కూడా ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు ధైర్యంగా పోటీ చేశారని పవన్ గుర్తుచేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో శ్రేణులు చూపిన పోరాట స్ఫూర్తి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి అందించిన సహకారం కీలకమని పేర్కొన్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో పార్టీ శక్తిసామర్థ్యాలను మరింత పెంచి మెరుగైన ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.
21 సీట్ల వ్యూహం.. స్థానిక ఎన్నికలకు కాదు
జనసేన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం వెనుక ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ వ్యూహం కేవలం సార్వత్రిక ఎన్నికలకే పరిమితమని, స్థానిక ఎన్నికల్లో అదే విధానం కొనసాగదని తెలిపారు. ప్రతి ప్రాంతంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోటీ చేసే స్థానాలను నిర్ణయిస్తామని చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా, పరిసర ప్రాంతాల్లోనూ పార్టీ బలాబలాలను అంచనా వేసి జనసేనకు అనుకూలంగా ఉన్న స్థానాలను గుర్తించి కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామని పవన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న శ్రేణుల అసంతృప్తిని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
11 మందితో ప్రత్యేక కమిటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 9 నుంచి 11 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులకు చోటు కల్పించనున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల ఆలోచనలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించనుంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. జనసేన నాయకులు, కార్యకర్తలకు రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, నాగబాబు, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు పాల్గొని స్థానిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
#PawanKalyan #JanaSena #JanaSenaParty #LocalElections #AndhraPradeshPolitics #APPanchayatElections #LocalBodyElections #JanaSenaCadre #PoliticalStrategy #AndhraPradesh #PawanKalyanStrategy #CoalitionPolitics #JanaSenaLeaders #APPolitics #ElectionStrategy











