Home Telangana 22/ఎ భూములపై ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం

22/ఎ భూములపై ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం


అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు.

22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరగా తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని స్పష్టం చేశారు. ప్రతి కేసును విడివిడిగా, సమగ్రంగా పరిశీలించి అర్హులకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్లు సబ్‌రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు.

అర్హులకు రిజిస్ట్రేషన్‌లో జాప్యం వద్దు

టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడిన మంత్రి.. భూమి 22/ఎ జాబితాలోకి ఎందుకు వచ్చింది, సంబంధిత రికార్డులు ఏమి చెబుతున్నాయి, ప్రస్తుతం భూమి పరిస్థితి ఏంటి, హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి వంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని కేసుల్లో కారణాన్ని దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 22/ఎ భూముల విషయంలో ప్రజలు అపోహలు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించడం, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

 

 

#PonguletiSrinivasReddy #22ALands #22AProhibitedLands #TelanganaNews #TelanganaPolitics #LandRegistration #RevenueDepartment #TelanganaGovernment #LandIssue #RegistrationIssue #TelanganaRevenue #LandRights #Khammam #TelanganaBreakingNews