Home Telangana పొంగులేటి బర్తరఫ్‌ చేయాలి బాధితులకు అండగా బీఆర్ఎస 22ఏ భూములపై హరీశ్‌ ఫైర్

పొంగులేటి బర్తరఫ్‌ చేయాలి బాధితులకు అండగా బీఆర్ఎస 22ఏ భూములపై హరీశ్‌ ఫైర్



22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 30, 40 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 22ఏ జాబితా నుంచి కొన్ని భూములను తొలగించి రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత మళ్లీ అదే జాబితాలో చేర్చారంటూ ఆరోపించారు. పది రోజుల క్రితం ఒక్క ఎకరా కూడా 22ఏలో పెట్టలేదని మంత్రి పొంగులేటి చెప్పారని, ఇప్పుడు అధికారులు తప్పు చేశారని చెబుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి స్పష్టత ఉంటే వెంటనే 22ఏలో చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

సీఎంకు ముందే సమాచారం?

పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్

22ఏ నిషేధిత జాబితా అంశాన్ని నాలుగు నెలల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండా ఇంత పెద్ద వ్యవహారం జరిగే అవకాశం ఉందా? అని నిలదీశారు. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రేవంత్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

బాధితులకు బీఆర్‌ఎస్ భరోసా

ఉచిత న్యాయ సహాయానికి లీగల్ సెల్ ఏర్పాటు

22ఏ భూముల బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో తమను కలిసిన బాధితుల సమస్యలను విన్న ఆయన.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్‌లో 10 మంది న్యాయవాదులతో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయ సహాయంతో పాటు ఎమ్మెల్యేలు అధికారులను, కలెక్టర్లను కలిసి సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధితులకు అండగా ఉంటారని తెలిపారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 

#HarishRao #BRS #PonguletiSrinivasReddy #RevanthReddy #22ALands #22AProhibitedLands #TelanganaPolitics #TelanganaNews #BRSNews #LandIssue #TelanganaLandIssue #RevenueDepartment #KCR #LegalCell #LandVictims #TelanganaGovernment