పొంగులేటి రాజీనామా చేయాలి.
నిషేధిత జాబితాలో పెట్టిందెవరు?
ప్రజలకు చెప్పాల్సిందే: హరీశ్ రావు.
మల్కాజ్‌గిరిలో 22ఏ నిషేధిత భూముల జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22ఏ జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి?” అని నిలదీశారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూఎఎల్సీని రద్దు చేసిన తర్వాత ఆ భూములు పట్టా భూములుగా మారి, ప్రజలు ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారని చెప్పారు. 20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డిలో 7,500కు పైగా జీఓల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లో 6,000కు పైగా భూములు, హెచ్ఎండీఏ, హుడా భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయని ఆరోపించారు.
బాధ్యులెవరో తేల్చాలి
భూమిని విక్రయించేందుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే వరకు తమ ఆస్తి 22ఏ జాబితాలో ఉందన్న విషయం కూడా ప్రజలకు తెలియడం లేదని హరీశ్ రావు అన్నారు. తిలక్‌నగర్‌కు చెందిన అశోక్ 450 గజాల ఇంటిని విక్రయించేందుకు వెళ్లిన తర్వాత నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసిందని ఉదాహరణగా చెప్పారు. “నిషేధిత జాబితాలో భూములను పెట్టాలని చెప్పింది ఎవరు? ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటామంటే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు. బిగ్ టీవీ జర్నలిస్ట్ అశోక్ తన సమస్యను సోషల్ మీడియాలో వెల్లడించారని, ఆయన ఒక్కరే కాదని, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగించుకోవాలా అని ప్రశ్నించారు. జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచి వైట్‌పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి రాజీనామా చేయాలి
నిషేధిత భూముల వ్యవహారంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత వహించి వెంటనే పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. “నిషేధిత జాబితాలో పెట్టింది మీరే.. తీసేయాల్సింది కూడా మీరే. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా, కార్యాలయాల చుట్టూ తిప్పకుండా భూములను జాబితా నుంచి తొలగించాలి” అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ కూడా సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా భూదందాకు పాల్పడుతున్నారన్న అనుమానాలు ప్రజల్లో బలపడతాయని హెచ్చరించారు. 22ఏ భూములపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, బాధితులకు తెలంగాణ భవన్‌లోని “జనతా గ్యారేజీ” ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పుడు పనులకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
#HarishRao #22ALands #22A #Telangana #BRS #RevanthReddy #PonguletiSrinivasReddy #22ALandIssue #ProhibitedLands #TelanganaLandIssues #LandRegistration #PropertyRights #BRSProtest #TelanganaPolitics #RevenueDepartment #LandOwners #TelanganaGovernment #WhitePaper #HarishRaoNews #TelanganaNews











