Home General కోర్టు గడప తొక్కిన భార్య వేధింపులకు కోర్టు పిడుగు..!

కోర్టు గడప తొక్కిన భార్య వేధింపులకు కోర్టు పిడుగు..!


కాలయాపన చేస్తే ఇక భారీ మూల్యం

ఒకప్పుడు పెళ్లి పందిరిలో మొదలైన బంధం.. కాలం గడిచేకొద్దీ కష్టాల కడలిగా మారింది. మాటలు మంటలయ్యాయి.. కలిసి జీవించాల్సిన జీవితం నరకప్రాయంగా మారిందన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు భర్తతో కలిసి ఉండలేనంటూ భార్య కోర్టు గడప తొక్కింది. విడాకుల కోసం వేసిన అడుగులు.. మూడేళ్ల న్యాయపోరాటంగా మారాయి. ఒకవైపు విడాకులు కావాలంటున్న భార్య.. మరోవైపు కాపురానికి పంపించాలంటున్న భర్త. మధ్యలో లోక్‌ అదాలత్‌ రాజీ.. ఆ తర్వాత మళ్లీ హైకోర్టు మెట్లు. కేసు ముగుస్తుందనుకున్న ప్రతిసారీ మరో మలుపు తిరిగింది. కానీ ఈసారి కోర్టు మాత్రం గట్టిగా స్పందించింది. న్యాయ ప్రక్రియను సాగదీస్తే చూస్తూ ఊరుకోబోమని తీర్పుతో స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేయడమే కాదు.. భార్యకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కుటుంబ వివాదం చివరకు న్యాయస్థానంలో ముగిసినా.. ఈ తీర్పు మాత్రం వేధింపులకు, కాలయాపనకు గట్టి హెచ్చరికగా మారింది.


వివాహ బంధంలో మొదలైన విభేదాలు చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కించాయి. తెనాలి పరిధిలోని ఈ కుటుంబ వివాదంలో భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు ప్రాణహాని ఉందని ఆరోపణలు వచ్చాయి. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన నాగ సౌజన్యకు 2016 ఏప్రిల్‌ 22న పొన్నూరు మండలం దొప్పలపూడికి చెందిన యలవర్తి నాగబ్రహ్మంతో వివాహమైంది. కొంతకాలానికి పరిస్థితులు విషమించడంతో కలిసి జీవించడం సాధ్యం కాదంటూ సౌజన్య 2023లో తెనాలి ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆశ్రయించారు. విడాకులు కోరిన ఆమెకు న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం తప్పలేదు.

రాజీ తర్వాత మళ్లీ వివాదం

భార్య విడాకులు కోరగా.. భర్త మాత్రం ఆమెను తిరిగి కాపురానికి పంపాలని 2024లో పిటిషన్‌ వేశారు. కేసులు నడుస్తున్న సమయంలో లోక్‌అదాలత్‌లో రాజీకి వెళ్లి విడాకులు పొందేందుకు అనుమతులు కూడా తీసుకున్నారు. కానీ తర్వాత నాగబ్రహ్మం హైకోర్టును ఆశ్రయించి, తనతో హడావుడిగా సంతకాలు చేయించుకున్నారని, లోక్‌అదాలత్‌ రాజీని రద్దు చేయాలని కోరారు. తెనాలి కోర్టు విచారణపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో రెండు కేసులను కలిపి విచారించిన తెనాలి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భార్య విడాకుల పిటిషన్‌ను అనుమతించి.. భర్త కాపురానికి పంపాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది.

కాలయాపనకు లక్ష రూపాయల షాక్

ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైంది. భార్యపై మానసిక వేధింపుల ఆరోపణలు రావడం మాత్రమే కాకుండా, న్యాయ ప్రక్రియను సాగదీస్తూ కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసిన తీరును న్యాయమూర్తి ఎస్‌. వెంకటేశ్వరరెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న వెలువడిన తీర్పులో నాగ సౌజన్యకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని నాగబ్రహ్మంను ఆదేశించారు. ఈ తీర్పు కేవలం ఒక కుటుంబ వివాదానికి ముగింపు కాదు.. కోర్టు ప్రక్రియను కావాలనే ఆలస్యం చేస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పే హెచ్చరికగా నిలిచింది. వేధింపులు, న్యాయ కాలయాపనకు ఇక మూల్యం చెల్లించాల్సిందే అన్న బలమైన సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చింది.

 

#Tenali #DivorceCase #AndhraPradesh #FamilyCourt #MatrimonialDispute #WifeHarassment #MentalHarassment #DivorceJudgment #Compensation #LokAdalat #CourtCase #LegalNews #FamilyDispute #CourtDelay #IndiaLegalNews