తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ విమర్శించారు. “ఆయన ఏనాడూ జై తెలంగాణ అనలేదు.. అలాంటి వ్యక్తికి తెలంగాణ అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉంటుంది?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యలు ఉండేవని, కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా విద్యుత్ సమస్యలు కనిపిస్తున్నాయని అన్నారు. కల్యాణలక్ష్మిపై కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వానికి సమయం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సింగిల్ ఇంజన్‌తోనే వేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నానని చెబుతున్నారని, ఆ శ్రమ ఎవరి ప్రయోజనాల కోసం అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం చెబుతున్న డబుల్ ఇంజన్ పాలన కంటే తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.
కార్యకర్తలే బలం.. అధికారం ఖాయం
త్వరలో జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ప్రతి రోజు పార్టీ కార్యకలాపాలు నిర్వహించి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని నాయకులకు సూచించారు. ఒకప్పుడు టీఆర్ఎస్ కార్యాలయానికి భవనం అద్దెకు ఇవ్వడానికి కూడా కొందరు భయపడేవారని గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన జలదృశ్యం నుంచి పార్టీ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి 20 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలన్న కేసీఆర్ ఆలోచనతో ఈ భవనం నిర్మించారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ మళ్లీ పట్టాలెక్కుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
#KTR #RevanthReddy #KCR #BRS #Congress #TelanganaPolitics #TelanganaDevelopment #BRSvsCongress #TelanganaMovement #PowerSupply #24HoursElectricity #KalyanaLakshmi #TelanganaBhavan #BRSWorkers #TelanganaWelfare #TelanganaNews #KTRSpeech #RevanthReddyGovernment











