Home AP డ్వాక్రా మహిళలకు బిజినెస్ బూస్ట్

డ్వాక్రా మహిళలకు బిజినెస్ బూస్ట్


కూలీ నుంచి పారిశ్రామిక వేత్తలు.
రూ.3 లక్షల వరకు రుణాలు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి .

డ్వాక్రా మహిళలను కేవలం రుణాలు తీసుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని పస్తీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం

మహిళలు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. పస్తీనిధి రుణంతో యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్స్‌గా పరిగణించి ఆసక్తి, సామర్థ్యం ఉన్న మహిళలను గుర్తించనున్నట్లు చెప్పారు.

వ్యాపారం విజయవంతమయ్యే వరకు అండ

ఎంపికైన మహిళలకు కేవలం రుణ సాయం అందించడం కాకుండా ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్‌లోనూ ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వ తోడ్పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకుని తమకు తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు.

 

Business Boost for DWCRA Women: Loans Up to ₹3 Lakh to Turn Workers into Entrepreneurs