హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కట్టుబొట్టుపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులు దిగజారిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్తీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడూ విధానపరంగానే ఉండాలని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే దానిపైనే చర్చించాలని హితబోధ చేశారు. ప్రతిపక్షాల వాచాలత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని కూటమి నేతలకు సూచించారు. ఈ అనుచిత వ్యాఖ్యలు కేవలం హోంమంత్రిని మాత్రమే కాకుండా సగటు మహిళలందరినీ కించపరచినట్లేనని పవన్ అన్నారు. కూటమి నాయకులు ఎవరూ ప్రత్యర్థుల మాదిరి దిగజారుడు భాష వాడకుండా పౌర సమాజం మెచ్చేలా బలంగా బదులివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.










