Home Political_News సింగరేణి యాజమాన్యానికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్

సింగరేణి యాజమాన్యానికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్

43

“అడవిలో అన్నలు లేరని అలుసు తీసుకుంటే ఖబర్దార్.. వారంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు” అంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత సింగరేణి యాజమాన్యంపై నేరుగా విరుచుకుపడ్డారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే-7 భూగర్భ గని వద్ద జరిగిన ఉద్రిక్త పరిణామాల మధ్య కార్మికుల హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత చేపట్టిన “బొగ్గుబాయి” కార్యక్రమం సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే-7 భూగర్భ గని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవితను, పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. అనంతరం గేట్లను దాటి గని ప్రాంగణంలోకి ప్రవేశించిన కవిత, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే సహించబోమని హెచ్చరించిన ఆమె, గతంలో అడవిలో ఉన్న అన్నలంతా ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానిస్తూ యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత చేపట్టిన “బొగ్గుబాయి” కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 భూగర్భ గని వద్ద భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన
కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే కనీస హక్కును కూడా సింగరేణి యాజమాన్యం కాలరాస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భంలో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులకు యాజమాన్యం కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని ఆరోపించారు. కార్మికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, సింగరేణిలో జరిగే అక్రమాలను నిరంతరం నిలదీస్తూనే ఉంటామని, అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతాల్లో పర్యటించలేదా అని నిలదీశారు. ఇప్పుడు తాము వచ్చి కార్మికుల సమస్యలు తెలుసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో చూస్తామన్నారు. కార్మికుల హక్కుల కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.