Home Telangana ఇందిరమ్మ ఇండ్లకు మరో ఐదు రోజులు

ఇందిరమ్మ ఇండ్లకు మరో ఐదు రోజులు


ఆగస్టు 15 వరకు దరఖాస్తుల స్వీకరణ.

హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ పథకం దరఖాస్తుల గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో మరింత మంది అర్హులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జూలై 21 నుంచి మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌, మీ-సేవా వాట్సాప్‌ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఇళ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

నెలాఖరులోగా ఇళ్ల కేటాయింపు

ప్రభుత్వ భూములను వినియోగించి నామమాత్రపు ధరకు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దరఖాస్తుల గడువు పెంచినప్పటికీ పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ ప్రక్రియలో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా అర్హుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా కూకట్‌పల్లిలో అత్యధికంగా 6,615 దరఖాస్తులు రాగా, కుత్బుల్లాపూర్‌లో 5,571, ఖైరతాబాద్‌లో 5,518, నాంపల్లిలో 4,372 దరఖాస్తులు వచ్చాయి. వరుస సెలవులతో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు ఆగస్టు 15లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

 

#IndirammaHouses #IndirammaHousesScheme #Telangana #Hyderabad #PonguletiSrinivasReddy #TelanganaGovernment #HousingScheme #IndirammaTowers #AffordableHousing #HyderabadHousing #TelanganaHousing #HousingForPoor #MiddleClassHousing #TelanganaNews #August15Deadline